Congress Government | హైదరాబాద్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): ‘తప్పు చెయ్. దానిని కప్పి పుచ్చుకోవడానికి అంతకన్నా పెద్ద తప్పు చెయ్’- ఇదీ గత పది నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న పాలసీ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక వైఖరిని కాకుండా డైవర్షన్ పాలిటిక్స్‌ను నమ్ముకొని పాలన సాగిస్తున్నారు. ఒక సమస్య వస్తే దానిని కప్పిపుచ్చేందుకు మరో సమస్యను సృష్టిస్తూ గందరగోళంలో ముంచుతున్నారనే విమర్శను ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమనే వాదన వినిపిస్తున్నది. నిజానికి మంత్రి సురేఖను సోషల్‌మీడియాలో ట్రోల్ చేయడాన్ని మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్ సహా పలువురు నేతలు ఖండించారు. అటువంటి వాటిని వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీ పరంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. అయినా, కేటీఆర్ స్పందించలేదంటూ ఆయనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యల వెనుక డైవర్షన్ పాలిటిక్స్ వ్యూహం దాగి ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతలతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు పలువులు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసహనం వ్యక్తంచేస్తున్నారు. బయట తిరగలేకపోతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘తొందరపడి కూల్చొద్దని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చెప్తుండగా, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం హైడ్రా అనంతర పరిణామాలపై సీఎం ఒంటెద్దు నిర్ణయాలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తాయని ఆంతరంగిక చర్చల్లో అభిప్రాయపడినట్టు సమాచారం. మరోవైపు ప్రజా వ్యతిరేకతపై నివేదికలు అందుకున్న అధిష్ఠానం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని మొట్టికాయలు వేసిందని గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హైడ్రాతో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పెద్దల పర్యవేక్షణలో మొన్నటికి మొన్న ఒక ప్రముఖ హీరోయిన్ చేసిన కామెంట్ అంటూ ఒక కరపత్రాన్ని సోషల్ మీడియాలోకి వదిలారు. అది వైరల్ అయినా కావాల్సినంత మైలేజ్ రాలేదు. దీంతో ఈసారి ఏకంగా మహిళా మంత్రినే రంగంలోకి దించి, సినీ కుటుంబాల వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాల్లోకి లాగారనే చర్చ జరుగుతున్నది.
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా తయారైంది.. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. హైడ్రా కూల్చివేతలు, మూసీ విధ్వంసంపై వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నం దేశవ్యాప్త వివాదానికి దారితీసింది. సర్కారు తీరును ప్రశ్నిస్తున్న కేటీఆర్‌ను టార్గెట్ చేస్తే, బాణం గురితప్పి కాంగ్రెస్‌కు గుచ్చుకున్నది. తనను బీఆర్ఎస్ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ రెండోరోజుల కిందట కంటతడిపెట్టిన కొండా సురేఖ నాటకాన్ని రక్తి కట్టించారు. తాజాగా సమంత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటంతో సీన్ రివర్సయింది. సురేఖ తీరు వివాదాస్పదం కావడంతో అధిష్ఠానం సీఎంను వివరణ కోరినట్టు తెలిసింది.
సినీ నటి సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ సమంత సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పార్టీలకు, భావజాలాలకు అతీతంగా పలువురు సెలబ్రిటీలు, సామాజిక ఉద్యమకారులు సమంతకు మద్దతుగా నిలిచారు. సమంతపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో మహిళల హక్కులు, వ్యక్తిగత గోప్యతపై చర్చ మొదలైంది. సమంత సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఆమె అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సురేఖను తిట్టిపోస్తున్నారు. రాజకీయంగా విభేదాలు ఉంటే ప్రతిపక్షాలతో పోరాడాలని, మధ్యలోకి సినీ నటిని తీసుకొచ్చి ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘హైడ్రా, మూసీ కూల్చివేతలపై దృష్టి మళ్లించడం కోసం ఒక మహిళా మంత్రి.. మరో స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఆరోపణలు చేసి తన బుద్ధి ఎలాంటిదో మీడియా సాక్షిగా ప్రకటించింది’ అని టీజీ సెక్రటేరియట్ మీడియా గ్రూప్‌లో విమర్శించారు. ‘ఒక మహిళ అయి ఉండి, మరో మహిళ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లో లాగడం సిగ్గుమాలిన చర్య. అమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సుమంతకు క్షమాపణ చెప్పాలి’ అని శోభ అనే నెటిజన్ డిమాండ్ చేశారు.