ఆయన ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి. రోగమొస్తే.. తమను తల్లికోడిలా కాపాడుకొంటాడని ప్రజలు అతనికి ఓట్లేసి గెలిపించారు. అయితే, అధికారంలోకి వచ్చింది మొదలు.. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. ప్రభుత్వ దవాఖానలను నిర్లక్ష్యం చేశారు. ఇదే సమయంలో ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చే ప్రైవేట్ దవాఖానలపై ఎనలేని ప్రేమ చూయించారు. అంతటితో ఆగకుండా కార్పొరేట్ దవాఖానల ప్రారంభోత్సవాలకు స్వయంగా వెళ్తూ.. కొత్త బ్రాంచీలను ప్రారంభించి బాగా సంపాదించుకోవాలని బహిరంగంగానే టార్గెట్లు పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించే ఈ ఉపోద్ఘాతమంతా!!
రేవంత్‌రెడ్డి పాలనలో.. వైద్యాన్ని ఖరీదుగా మార్చిన రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఏదైనా జబ్బు చేసి ఓ సామాన్యుడు కార్పొరేట్ దవాఖాన మెట్లు ఎక్కాడో.. ఆ ఇల్లు దివాలా తీయాల్సిందే. ప్రైవేట్ దవాఖానలో చేరే ఒక్కో కేసుకు తెలంగాణ పౌరుడు సగటున చెల్లిస్తున్న మొత్తం రూ. 72,561. దేశంలోనే ఇది అత్యధికం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : దేశంలో వైద్యాన్ని అత్యంత ఖరీదుగా మార్చిన రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నది. ఈ మేరకు 80వ నేషనల్ ‘శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఆన్ హౌస్‌హోల్డ్ సోషల్ కన్జమ్షన్ ఆఫ్ హెల్త్’ తాజా సర్వేలో తేలింది. తెలంగాణలోని ఏదైనా ప్రైవేట్ దవాఖానలో ఎవరైనా చేరితే, సగటున రూ.72,561 మేర ఖర్చు చేయాల్సి వస్తున్నదని నివేదిక తేల్చి చెప్పింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఈ మేర ఖర్చులు లేవని వెల్లడించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సగటున రూ.5,856 మేర ఖర్చు అవుతున్నట్టు తెలిపింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది.. ఖర్చు ఎక్కువైనప్పటికీ, ప్రైవేట్ దవాఖానల బాట పడుతున్నట్టు నివేదిక తెలిపింది. సర్కారీ దవాఖానల్లో రేవంత్ ప్రభుత్వం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రజలు తమ జేబులకు చిల్లులు పడుతున్నా గత్యంతరం లేక ప్రైవేట్ దవాఖానలకు ఆశ్రయిస్తున్నారు.
తెలంగాణలో ఎవరైనా దవాఖానలో చేరితే ఒక్కొక్కరు సగటున రూ.52,743 మేర ఖర్చు చేయాల్సి వస్తున్నదని నివేదిక తెలిపింది. దేశ సగటు రూ.34,064తో పోల్చి చూస్తే ఇది 55% ఎక్కువ అని నివేదిక పేర్కొన్నది. తెలంగాణలోని ప్రైవేట్ దవాఖానల్లో ఒక్కో కేసుకు సగటున రూ.72,561 వసూలు చేస్తుండగా, ప్రభుత్వ దవాఖానల్లో రూ.5,856 ఖర్చు అవుతున్నట్టు వివరించింది. తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే, ప్రైవేట్ దవాఖానల్లో 12 రెట్లు ఎక్కువగా ఖర్చు అవుతున్నదని తెలిపింది. వైద్యసేవల భారం ఎక్కువగా ఉండటంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, దేశంలోని 1.39 లక్షల మంది కుటుంబాలపై 2025లో (జనవరి నుంచి డిసెంబర్ వరకు) ఈ సర్వే చేసినట్టు కేంద్రం తెలిపింది.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కునారిల్లిన ప్రజారోగ్యం.. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కొత్తగా ఊపిరి పోసుకొన్నది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పాడుబడిన భవనాలు బాగయ్యాయి. ఖాళీ పోస్టులు దాదాపు నిండిపోయాయి. సరిపడా మందులు, అన్ని స్థాయిల్లోనూ అత్యాధునిక సదుపాయాలతో ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానలు వైద్య సేవలు అందించాయి. దీంతో ఒకప్పుడు ‘నేను రానుబిడ్డో.. సర్కార్ దవాఖానకు..’ అని పాడుకున్న రోజుల నుంచి ‘చలో పోదాం.. సర్కార్ దవాఖానకు’ అని చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం పడకేయగా.. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా మారింది. నాడు కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేసిన విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు, మానవీయ పథకాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. క్షేత్రస్థాయిలో బస్తీ దవాఖానలు, సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు ఉత్తమ సేవలు అందించి రోగాలు ముదరకముందే చికిత్స అందించగా, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందేవి. అందుకే కేసీఆర్ పాలనలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అనేక రికార్డులు నెలకొల్పింది. నీతిఆయోగ్ వంటి ప్రతిష్ఠాత్మక విభాగాలతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పదుల సంఖ్యలో అవార్డులు, ప్రశంసలు దక్కించుకున్నది.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందుకోవడం కష్టంగా ఉండేది. పేదలకు స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, డాక్టర్ కావాలనుకొనే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ఓ బృహత్తర ఆలోచన చేశారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అలా 2016లో సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూ ర్యాపేటలో నాలుగు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. 2021లో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో 8 మె డికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ వీటిని స్వయంగా ప్రారంభించి, ఒకేరోజు తరగతులు ప్రారంభించి దేశ చరిత్రలోనే కొత్త రికా ర్డు సృష్టించారు. ఆ తర్వాత నిర్మల్, ఆసిఫాబా ద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్ తదితర జిల్లాల్లోనూ కాలేజీలు ప్రారంభమయ్యాయి.
కేసీఆర్ హయాంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే రాష్ట్రంగా మారిన తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెండున్నరేండ్ల పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసింది. మెజారిటీ దవాఖానల్లో డాక్టర్ల కొరత విపరీతంగా వేధిస్తున్నది. ప్రాణాధారమైన మందుల నిల్వలు కూడా తగినంతగా ఉండటంలేదు. అత్యాధునిక సదుపాయాల కల్పన లేకపోవడంతో మొత్తంగా ప్రజావైద్యం కునారిల్లుతున్నది. అనేకచోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొన్నది. వెరసి ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు జంకుతున్నారు. దీంతో జేబులు ఖాళీ అవుతాయని తెలిసినప్పటికీ, ప్రైవేట్ దవాఖానలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా అవసరం ఉన్నా, లేకున్నా టెస్టుల పేరిట కొన్ని ప్రైవేట్ దవాఖానలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. దీన్ని ధ్రువపరిచేలా.. రేవంత్ పాలనలో వైద్యాన్ని ఖరీదుగా మార్చిన రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డులకెక్కింది.
2028, డిసెంబర్ వరకూ నేను తెలంగాణకు సీఎంగా ఉంటా. అప్పటిలోపు మీరు 100వ హాస్పిటల్‌ను ప్రారంభించాలని కోరుకొంటున్నా.
-ఇటీవల ప్రైవేట్ హాస్పిటల్ అపోలో యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
డాక్టర్లు రాసిన టెస్ట్‌ల రిపోర్టులు, ఎక్స్‌రే రిపోర్టు ఇవ్వడానికి పేపర్లు లేవు. కావాలంటే సెల్ఫోన్లో ఫొటో తీసుకోండి.
-సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోస్గిలోని ప్రభుత్వ దవాఖానలో పేషెంట్లకు సిబ్బంది ఇస్తున్న సమాధానం!

సీఎం ఇలాకాలోని కోస్గి ప్రభుత్వ దవాఖాన దుస్థితి
కోస్గి, ఏప్రిల్ 30 : ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు కరువయ్యాయి. దవాఖానకు వచ్చే పేషెంట్లకు డాక్టర్లు అవసరమైన టెస్టులు రాస్తే, ఆయా రిపోర్టులు ఇవ్వడానికి పేపర్లు లేవని సిబ్బంది సమాధానం చెప్తున్నారు. గురువారం పట్టణానికి చెందిన శేఖర్ ఎముకల్లో నొప్పి ఉన్నదని దవాఖానకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది ఎక్స్‌రే తీశారు.

కాసేపటి తర్వాత రిపోర్టు కోసం సిబ్బందిని అడుగగా, వారు సెల్ఫోన్లోనే ఫొటో తీసుకోవాలని.. రిపోర్టు ఇవ్వడానికి పేపర్లు లేవని సమాధానమిచ్చారు. దీనిపై బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట నర్సింహులు స్పందిస్తూ.. సీఎం నియోజకవర్గం అంటే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించామని, కానీ,ఇలా కొత్త సమస్యలు తెస్తారని అనుకోలేదని దుయ్యబట్టారు. దవాఖానలో పేపర్లు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ అని విమర్శించారు.