గ్వాలియర్:బీజేపీపాలిత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇక్కడి మహారాణా ప్రతాప్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సైన్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అనుబంధంగా ఉన్న 100 పడకల థాక్రే మల్టీ స్పెషాలిటీ దవాఖాన కేవలం కాగితాలకే పరిమితమైందనే ఆరోపణలు వెలుగు చూశాయి. భవనం లోపల రోగులు, జనసంచారం లేకపోవడం లాంటి పరిస్థితులు నర్సింగ్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ ఎలా అందుతుందనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
భోపాల్లో బహిరంగంగా డ్రగ్స్ అమ్మకాలు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుపుతూ, వాటిని అమ్మే, వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నది. అయినా, భోపాల్ హబీబ్గంజ్ ప్రాంతంలోని శ్యామ్నగర్లో పరిస్థితి యథాతథంగానే ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జన విశ్వాస్ అభియాన్ శిబిరంలో ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న డ్రగ్స్, గంజాయి, మద్యం అమ్మకాల పట్ల మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
మొబైల్ టార్చి వెలుతురులో అత్యవసర వార్డులో చికిత్స
విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో బీహార్లోని రోహ్తాస్ జిల్లా ససారం సదర్ దవాఖానలో మొబైల్ టార్చి వెలుతురులో అత్యవసర వార్డులోని రోగులకు చికిత్స అందించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సదర్ హాస్పిటల్కు అనుబంధంగా ఉన్న మాడల్ దవాఖానలో ఇది చోటు చేసుకుంది. దవాఖానకు ప్రత్యేక విద్యుత్తు బ్యాకప్ సౌకర్యం ఉన్నప్పటికీ అది పనిచేయ లేదు. మొబైల్ ఫోన్లోని టార్చి వెలుతురు లోనే రోగులకు డాక్టర్లు, వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్న దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఈ దవాఖానకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఉంది. అంతేకాకుండా జనరేటర్లు, ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్స్ వంటి ప్రత్యేక బ్యాకప్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి.