కన్నడ అగ్రనటుడు ‘కేజీఎఫ్’ఫేం యశ్ కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా ట్రైలర్‌ని బెంగళూరులో ఘనంగా విడుదల చేశారు. చిత్ర బృంద మంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రైలర్ ఆద్యంతం ఆధిపత్య పోరుతో కూడిన హింసాత్మక మాఫియా ప్రపంచాన్ని ఆవిష్కరించింది. అంతర్లీనంగా ఓ బలమైన కథ కూడా ఉన్నట్టు అర్థమవుతున్నది.
‘ముసుగేసుకొని మొహం మీదున్న దుఖాన్ని దాచిపెట్టొచ్చు.. నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేం..’, ‘అమ్మాయిలకు అందమే అసలైన సింగారం.. ఆ అందాన్ని ఆయుధంగా వాడితే ఎలా బంగారం..’ లాంటి డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో యశ్ పాత్ర పేరు ‘రాయ’ అని నయనతార డైలాగ్ ద్వారా అర్థమైంది. ట్రైలర్లో కథానాయికలు కైరా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, రుక్మిణి వసంత్ సైతం నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు.
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, కెమెరా యాంగిల్స్, సినేరియా.. ఇలా అంతా హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి. ఇందులో యశ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసినట్టు ట్రైలర్ చూస్తే అవగతమైంది. ట్రైలర్‌ని బట్టి ఇది తండ్రీకొడుకుల భీకరపోరు అని చెప్పొచ్చు. తగలపడిపోతున్న రగులరాట్నం ఏదో భయంకరమైన కథ చెబుతున్నట్టుంది. కొడుకు పాత్ర క్రూరంగా కనిపిస్తున్నది. 4 నిమిషాల 38 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్లో 3 నిమిషాలు పూర్తవ్వగానే కొడుకు పాత్ర రివీల్ అయింది.
‘శాంతి వల్ల అంతా బావుంటే.. శతాబ్దాలుగా యుద్ధాలెందుకు జరిగేవిరా..?’ అంటూ కొడుకు యశ్ చెప్పే డైలాగ్ కథపై ఆసక్తిని రేకెత్తించింది. నాగరికత గురించి మాట్లాడుతూనే అనాగరికతను ట్రైలర్లో బలంగానే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ చూపించారు. మొత్తంగా పరిథులు లేని ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’ అని ట్రైలర్ చెప్పింది.