హాలియా, ఆగస్టు 8 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ విద్యుత్తు కోతలను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాలియాలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం హాలియా ప్రధాన సెంటర్లో ధర్నా నిర్వహించారు. ధర్నాతో హైవే మీదుగా వెళ్లే వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించడంతో స్థానిక ఎస్సై సాయి ప్రశాంత్ సిబ్బందితో వచ్చి రాస్తారోకోను విరమించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు రాస్తారోకో, ధర్నా విరమించేది లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెగేసి చెప్పడంతో ఎస్సై సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ కోతల్లేకుండా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్ఈ హామీ మేరకు ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం మాట తప్పితే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వందలాది మంది రైతులు తీసుకొచ్చి విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట మళ్లీ ధర్నా చేసామని హెచ్చించారు. అనంతరం భగత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతే కనీసం 18 గంటల పాటైనా ఇవ్వాలని, అలా ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.

ప్రభుత్వం విఫలం..
గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే భగత్‌కుమార్ అన్నారు. వందిలాది టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నా సీఎం మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగాపెట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పుకోసమే తాపత్రయపడుతున్నాడని వి మర్శించారు. కృష్ణానది పరీవాహక ప్రాంతం లో వర్షాలు సమృద్ధిగా కురిసినందున ఎగువ నుంచి కృష్ణానదిలోకి వరదనీరు వచ్చి చేరుతోందని, ప్రభుత్వం వెంటనే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించి కృష్ణా జలాలను కిందకు వదలాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యడవల్లి విజయేందర్‌రెడ్డి, చెన్ను సుందర్‌రెడ్డి, కర్ణ నర్సిరెడ్డి, రిక్కల మధుసూదన్‌రెడ్డి, కురాకుల వెంకటేశ్వర్లు. రవినాయక్, పిడిగం నాగయ్య, నాగులవంచ తిరుపతిరావు, తాటి సత్యపాల్, వడ్డే సతీష్‌రెడ్డి, నడ్డి బాలరాజు, శ్యాంసుందర్ రెడ్డి, బైరం కృష్ణ, వర్రా వెంకట్‌రెడ్డి, నల్లగొండ సుధాకర్, భిక్షానాయక్, చాపల సైదులు, పంగ లక్ష్మణ్, పిల్లి వెంకట్, పొదిల శ్రీను, మెండే సైదులు, నడ్డి సత్యం, కూన్‌రెడ్డి భాస్కర్‌రెడ్డి, చేగొండి కృష్ణ, సురభి రాంబాబు, కురాకుల రవి, సైదాచారి, దోరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రేవంత్ మాటల వల్లే రాష్ర్టానికి అరిష్టం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల వల్లనే తెలంగాణకు అరిష్టం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే దుయ్య బట్టారు. గత శాసన సభ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రేవంత్ అలవికాని హామీలు ఇచ్చాడన్నారు. ఓట్ల కోసం దేవుళ్లపై ఒట్లు పెట్టాడని, అధికారం కోసం ప్రజలను మోసగించినట్లే దేవుళ్లను కూడా మోసగించడంతో వరుణదేవుడు ఆగ్రహించడంతో రాష్ర్టానికి అరిష్టం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడాలని కోరుతూ ఈ నెల 10న కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో చేపట్టిన వరుణ యాగాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే ముఖ్యమంత్రి మొదట కాశీవెళ్లి గంగలో పుణ్యస్నానం చేసి, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే వరుణయాగంలో పాల్గొనాలని హితవు పలికారు.