(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తొలుత డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తూ యావత్తూ ప్రజానీకానికి అలవాటు చేసిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు చార్జీల బాదుడుకు తెరతీసింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ తదితర యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)’ను విధిస్తూ రూపొందించిన బిల్లుకు గురువారం లోక్‌సభ గుట్టుచప్పుడు కాకుండా ఆమోదం తెలిపింది. తద్వారా యూపీఐ పేమెంట్స్, రూపే డెబిట్ కార్డు పేమెంట్స్‌పై చార్జీలు వసూలు చేసుకొనే అధికారం బ్యాంకులకు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు (పీఎస్పీ) ఇస్తూ కేంద్రం తలుపులు బార్లా తెరిచింది. అయితే, కేంద్రం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వ్యక్తుల మధ్య జరిగే (పీ2పీ) యూపీఐ లావాదేవీలన్నీ యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. అయితే, వ్యాపారులకు సంబంధించిన లావాదేవీలపైనే నామమాత్రపు ఎండీఆర్ ఉంటుందని తెలిపింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ఎండీఆర్ కంటే ఈ చార్జీ తక్కువగా ఉంటుందని తెలిపింది. కాగా కేంద్రం ప్రకటనపై ప్రజలు భగ్గుమంటున్నారు. అంతిమంగా వ్యాపారులు కూడా తమ నుంచే ఈ చార్జీని వసూలు చేస్తారని లబోదిబోమంటున్నారు.
0.8 శాతం వరకూ ఎండీఆర్?!
కేంద్రం ఇచ్చిన తాజా వివరణ ప్రకారం.. పీ2పీ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు లేకపోయినప్పటికీ, పీ2ఎం (పర్సన్ టూ మర్చెంట్) ట్రాన్సాక్షన్లపై చార్జీలు ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎంత మేరకు ఈ ఎండీఆర్ చార్జీలు విధిస్తారన్న దానిపై కేంద్రం ఇప్పటికైతే స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే, ఎం2సీ లావాదేవీలపై విధించే యూపీఐ ఎండీఆర్.. డెబిట్, క్రెడిట్ కార్డుల ఎండీఆర్ కంటే తక్కువగా ఉంటుందని కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డుల ఎండీఆర్ కనిష్ఠంగా 0.4 నుంచి గరిష్ఠంగా 2 శాతం వరకూ ఉన్నది. దీన్నిబట్టి.. రూ. 2 వేలకు మించిన లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5-0.8 శాతం వరకు యూపీఐ ఎండీఆర్‌ను విధించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
అంతిమంగా సామాన్యుడికే పోటు
ఓ కస్టమర్ రూ.2 వేల విలువైన వస్తువు ధరను రూపే డెబిట్ కార్డు లేదా యూపీఐ యాప్ ద్వారా రుసుం చెల్లించాడనుకొందాం. జీరో ఎండీఆర్ పాలసీ రద్దు కాబోతున్న నేపథ్యంలో.. కస్టమర్ పేమెంట్‌ను ప్రాసెస్ చేసినందుకు బ్యాంకులు, పీఎస్పీలు వ్యాపారుల దగ్గర ఇకపై చార్జీలను వసూలు చేస్తాయి. దీనివల్ల వ్యాపారి ఖాతాలో రూ. 2 వేల కంటే తక్కువ జమవుతుంది. దీంతో తాను నష్టపోయే సదరు చార్జీ మొత్తాన్ని వ్యాపారులు.. కస్టమర్ దగ్గరే వసూలు చేసే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
యూపీఐ పేమెంట్లపై అదనపు భారం లేదు: ఫోన్‌పే
లోక్‌సభలో కొత్త పన్ను సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ స్పందిస్తూ, యూపీఐ లావాదేవీలు వినియోగదారులకు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని, వారు ఎటువంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా ‘యూపీఐ సేవలు భారతీయ వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉచితం’ అని పేర్కొన్నారు.