హైదరాబాద్, మే 27 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఉద్యానవన శాఖ దశ, దిశ లేకుండా కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా కార్యాచరణను రూపొందించడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యానవన శాఖ అధికారులు 153 మంది ఉన్నారు. కానీ వీరికి క్షేత్రస్థాయిలో కార్యాలయం లేదు. ఒకొక అధికారి 3 నుంచి 10 మండలాలకు బాధ్యతలు నిర్వహిస్తారు.
కానీ వీరికి ఏ మండలంలో కేరాఫ్ అడ్రస్ లేదు. కనీసం ఒక టేబుల్ ఉండదు, సహాయకుడిగా అటెండర్ కూడా లేడు. కానీ ఉద్యోగరీత్యా పనిచేసిన మండలాల్లోని ఉద్యానవనానికి సంబంధించిన ప్రతి ఫైల్ మీద సంతకం పెట్టాల్సిందే. విధుల్లో భాగంగా రోడ్డుపైన, వాహనాలపై, బస్టాండ్‌లో ఉండే బళ్లాలను ఆధారం చేసుకొని సంతకాలు పెట్టాల్సిన దుస్థితి ఉన్నదని ఉద్యానవన శాఖ అధికారులు వాపోతున్నారు.
కేవలం జిల్లా స్థాయిలో జిల్లా ఉద్యానవన అధికారికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఆఫీస్ వసతి ఉన్నది. ఉద్యాన పంటలను విస్తరించేందుకు వీలుగా ప్రతి హార్టికల్చర్ ఆఫీసర్‌కి క్షేత్రస్థాయిలో కార్యాలయం వసతి కల్పించి, ఒక టేబుల్, ఒక బీరువా అయినా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.