హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): యూరియా కొరతను కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలొస్తున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్‌లో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాటులో ఉంచకుండా, ఒక్కో జిల్లాకు ఒక్కోసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. యూరియా యాప్‌ను ఓపెన్ చేయడానికి అన్ని జిల్లాలకు ఒకేసారి యాక్సెస్ ఇవ్వడంలేదు. కొన్ని జిల్లాలకు ఒకసారి, మరికొన్ని జిల్లాలకు ఇంకోసారి యాక్సెస్ ఇస్తున్నది. దీంతో రైతులు యూరియా బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఒక జిల్లాలో యాప్ ఓపెన్ కాగా, మరో జిల్లాలో ఓపెన్ కావడంలేదు. ఈ నెల 14వ తేదీన సంగారెడ్డి జిల్లా, 15న సిద్దిపేట, 18న భువనగిరి జిల్లాలకు యాప్ ఓపెన్‌కు ప్రభుత్వం యాక్సెస్ ఇచ్చింది.
ఇలా రోజుకో జిల్లాకు యాక్సెస్ ఇవ్వడం గమనార్హం. ఇందుకు సర్కార్ చెప్తున్న కారణం.. పంటల సాగు ముందుగా జరిగే జిల్లాలకు యాప్ యాక్సెస్ ఇచ్చి యూరియా పంపిణీ చేయాలని, తర్వాత సాగు చేసే జిల్లాలకు ఆలస్యంగా యాప్ యాక్సెస్ ఇవ్వాలని! అయితే, ప్రభుత్వ వాదనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూరియా కొరతను దాచేందుకు ఈ ఎత్తులు వేస్తున్నదని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఒకేసారి యాక్సెస్ ఇస్తే బుకింగ్‌లు పెరిగిపోయి రైతులందరికీ యూరియా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా సర్కార్ బద్నాం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ కుట్రలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో రైతు ఒక్కో విధమైన పంటలను సాగు చేస్తుంటారు. ఒక రైతు ముందుగానే పంటలు సాగు చేస్తే మరో రైతు కొంత ఆలస్యంగా సాగు చేస్తారు. ఎవరి వీలును బట్టి, ఎవరి ఆసక్తిని బట్టి వారు పంటలు సాగు చేస్తుంటారు. అయితే, ఇప్పుడు సర్కార్ తీరు ఒక జిల్లా రైతులంతా ఒకేసారి ఒకే పంటను సాగు చేయాలనే విధంగా ఉండటం గమనార్హం. ఒక్కో జిల్లాకు ఒక్కోసారి యూరియా యాప్‌ను ఓపెన్ చేస్తుండటంతో యాప్ ఓపెన్‌కాని జిల్లాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆ రైతులు ముందుగానే పంటలు సాగు చేయాలనుకొన్నా.. సర్కార్ నిర్వాకంతో సాగు చేయలేని పరిస్థితి నెలకొన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యూరియా యాప్ ఓపెన్ కాకపోవడం, యూరియా లభించకపోవడంతో రైతులు పంటల సాగును వాయిదా వేసుకొంటున్నారు. ప్రభుత్వం వరి, మక్కజొన్న సాగును మాత్రమే దృష్టిలో పెట్టుకొని యూరియాను సరఫరా చేస్తున్నదనే విమర్శలున్నాయి. పత్తితోపాటు కూరగాయల పంటలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడంలేదని, దీనితో కొన్ని జిల్లాల్లో కూరగాయల పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో ఎప్పుడు యూరియా స్టాక్ పెడుతున్నారో, ఎప్పుడు అయిపోతున్నదో తెలియక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు ఉద యం, మధ్యాహ్నం యూరియా కోసం ఫోన్లతో కుస్తీ పడుతున్నారు.