Women Marriage Age | న్యూఢిల్లీ, జూలై 14: భారతదేశంలో మహిళల సగటు వివాహ వయసు 19.3 ఏండ్ల నుండి 23.1 ఏండ్లకు పెరిగిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే(ఎస్ఆర్ఎస్), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎస్ఎఫ్హెచ్ఎస్) నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మహిలలు సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో సగటున 24.4 ఏండ్ల వయసులో, గ్రామీణ ప్రాంతాల్లో 22.6 ఏండ్ల వయసులో వివాహం చేసుకుంటున్నారని నివేదిక తెలిపింది. మహిళల చట్టపరమైన వివాహ వయసును 21 ఏండ్లకు పెంచేందుకు ప్రభుత్వం 2021లో ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే లోక్సభ రద్దు కావడంతో దానికి కాలదోషం పట్టింది. ఇప్పుడు ఈ విషయమై 2027 జనాభా లెక్కల తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
మహిళల వివాహ వయసు పెరగడానికి వెనుక ఉన్న కారణాలు జనగణన ద్వారా అంచనా వేయడానికి వీలు ఏర్పడుతుంది. ఉన్నత విద్యా వివాహాన్ని ఆలస్యం చేస్తోందా, ఆలస్య వివాహం సంతానోత్పత్తిని తగ్గిస్తోందా, ఇంటి ఖర్చులు, నిరుద్యోగం, వలసలు వంటివి దోహదపడుతున్నాయా వంటి విషయాలపై అధ్యయనం చేయడం వల్ల మహిళల వివాహం జాప్యానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఆలస్యంగా వివాహం చేసుకోవడం, జనన రేట్లు తగ్గడం వంటి తూర్పు ఆసియా తరహా ధోరణులను భారత్ ఇప్పుడు చూస్తోంది. జనాభా, విద్య, తల్లి ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలలో విధానపరమైన మార్పులు అవసరం.
భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) 1.9కి తగ్గింది. ఇందులోపట్టణ ప్రాంతాల్లో 1.5గా. గ్రామీణ ప్రాంతాల్లో 2.1గా ఉంది. మహిళలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల వారి సంతానోత్పత్తి కాలం తగ్గి తద్వారా జనన రేట్లు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలో 10-14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల జనాభా 24 శాతం తగ్గింది. పనిచేయగల వయసు గల జనాభా 66.4 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 6. ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు జనాభాలో 9.7 శాతం మందిగా ఉన్నారు.