ముంబై, జూలై 14(నమస్తే తెలంగాణ): ఓ మహిళ ప్రియుడి సహాయంతో భర్తను దారుణంగా హత్య చేసింది. సాక్ష్యాలను నాశనం చేయడానికి భర్త శరీరాన్ని కట్టర్‌తో మూడు ముకలుగా కోసి, వాటిని అడవిలో వేర్వేరు ప్రదేశాలలో పడేసింది. 11 నెలల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నవీ ముంబైలో ఈ ఘటన జరిగింది. ఐరోలిలోని యాదవ్‌నగర్‌లో బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా (50).. భార్య సునీత కుష్వాహా (40), ఇద్దరు పిల్లలతో ఉండేవాడు. ఆటోడ్రైవర్ రాహుల్ ప్రసాద్‌తో సునీత వివాహేతర సంబంధం ఉండేది. ఇది గమనించిన బలిరామ్ వారిద్దరినీ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో భర్తను హత్య చేయడానికి ప్రియుడితో కలిసి సునీత స్కెచ్ వేసింది.
నిరుడు ఆగస్టు 9న పిల్లలను అత్తగారి ఇంటికి పంపింది. తర్వాత ఇద్దరూ కలిసి బలిరామ్ గొంతు నులిమి, కత్తితో పొడిచి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని తల, మొండెం, కాళ్లు మూడు ముక్కలుగా నరికారు. వాటిని గావ్లీదేవ్ కొండ ప్రాంతంలోని దట్టమైన పొదల్లో మూడు వేర్వేరు చోట్ల పారేశారు. ఇటీవల బలిరామ్ సోదరుడు తన అన్న కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది.