Konda Surekha | హనుమకొండ, మే 8: ‘రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్ నగరంలో దారుణం.. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు.. హైదరాబాద్‌లో అయితే చెప్పడానికే వీల్లేదు.. బైక్ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు వెళ్తున్నారు..’ అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో యూత్ అండ్ స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా జాబ్‌మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెలే నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారద పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మత్తుకు బానిసలైన యువత రోడ్ల మీద ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నదని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. వరంగల్‌లో కూడా ఎన్నడూ చూడనటువంటి దారుణాలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నగరంలో క్రైమ్ రేట్ పెరిగిందని, యువత మత్తుకు బానిస కావడమే ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్‌లో చెప్పడానికి అవకాశమే లేదని, బైక్ రేస్‌లంటూ ఇష్టమొచ్చినట్టుగా వెళ్తున్నారని వివరించారు. వాళ్లు పడితే పర్వాలేదు.. కానీ, కిందపడి పక్కవాళ్లను చంపేస్తున్నారని, ప్రాణం అనేదానికి విలువ లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.