GRMB | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)లోనూ తెలంగాణ పరపతి దిగజారిపోయింది. తెలంగాణ అధికారులంటేనే ఏ మాత్రం లెక్కచేయని దుస్థితి అక్కడ నెలకొన్నది. నిధుల ఖర్చు, ఇతరత్రా అంశాలపై అసలు రాష్ర్టానికి అడిగే హక్కు లేదంటూ బోర్డు బాహాటంగా చెబుతున్నదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం, జీఆర్ఎంబీలోని తెలంగాణ అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసినా బోర్డు బుట్టదాఖలు చేయడమేగాక, తిరిగి సదరు అధికారులపైనే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మాత్రం చోద్యం చూస్తున్నదని రాష్ట్ర ఇంజినీర్లు, బోర్డులోని తెలంగాణ అధికారులు వాపోతున్నారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, వివాదాల పరిష్కారానికి రివర్ బోర్డులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ బోర్డుల్లో చైర్మన్, మెంబర్ సెక్రటరీతోపాటు ఇద్దరు మెంబర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మిగతా బోర్డు సెక్రటేరియట్లో రెండు రాష్ర్టాల నుంచి ఎస్ఈ, ఈఈ, డీఈఈ, ఏఈఈలను సమాన నిష్పత్తిలో నియమిస్తారు. రివర్ బోర్డు అనేది కేవలం రెండు రాష్ర్టాలను సమన్వయం చేసుకుంటూ వివాదాలను పరిష్కరించే ఒక ఏర్పాటు మాత్రమే. ఏ అంశంలోనైనా రాష్ర్టాలదే అంతిమ నిర్ణయం. కానీ జీఆర్ఎంబీ మాత్రం అందుకు విరుద్ధంగా అజమాయిషీ చెలాయిస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది.
ముఖ్యంగా బోర్డు మెంబర్ సెక్రటరీ తీరు నానాటికీ శ్రుతి మించిపోతున్నదని అధికారులు చెప్తున్నారు. రెండు రాష్ర్టాలు తమకు నచ్చిన, అంతర్రాష్ట్ర వివాదాలతోపాటు బేసిన్‌పై అవగాహన ఉన్న నిపుణులైన అధికారులను డిప్యుటేషన్‌పై బోర్డులో నియమించుకుంటాయి. అది రాష్ర్టాల హక్కు. దానిని జీఆర్ఎంబీ తుంగలో తొక్కుతున్నది. ఇటీవల ఆ బోర్డులో తెలంగాణకు చెందిన ఓ మహిళా అధికారి డిప్యుటేషన్ కాలం పూర్తయింది. దీంతో అధికారిణి సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ (అడ్మిన్) ఆమె డిప్యుటేషన్‌ను మరో ఏడాదిపాటు పొడిగించారు.
కానీ, ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ, తెలంగాణను అవహేళన చేస్తూ బోర్డు మెంబర్ సెక్రటరీ ఏకంగా ఓ లేఖ రాశారు. అంతేకాకుండా డిప్యుటేషన్లను కొనసాగించే అధికారం ఈఎన్సీకి లేదని, డిప్యుటేషన్ పొడిగింపును ఒప్పుకోబోమని తేల్చిపారు. ఇటీవల బోర్డులోని ఓ సూపరింటెండెంట్ డిప్యుటేషన్ కాలం పూర్తవడంతో మరొకరిని పంపించే వరకూ వేచిచూడాలని బోర్డుకు ఈఎన్సీ లేఖ రాశారు. కానీ, ఆ అధికారమే ఈఎన్సీకి లేదని బోర్డు మెంబర్ సెక్రటరీ మరోసారి తేల్చిచెప్తూ సదరు సూపరింటెండెంట్‌ను ఏకపక్షంగా రీలివ్ చేశారు.
జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ అజగేశన్ మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడమేగాక, అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మహిళా ఉద్యోగుల డ్రెస్సింగ్ స్టయిల్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతోపాటు, వారాంతాల్లో లంచ్ లేదా డిన్నర్ కోసం ఇంటికి పిలవాలంటూ వారిని ఒత్తిడి చేస్తున్నట్టు బోర్డు ఉద్యోగులు చెప్తున్నారు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ అలవెన్సు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక విషయంలోనూ అజగేశన్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
ఆ వ్యవహారాలపై బోర్డులోని ఏపీ, తెలంగాణ ఇంజినీర్లు, ఉద్యోగులు జీఆర్ఎంబీ చైర్మన్‌తోపాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో కూడా మెంబర్ సెక్రటరీ తీరుపై తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. అజగేశన్ ఆర్థిక అవకతవకలు, లైంగిక వేధింపులపై విచారణ జరిపి నిజాలను నిగ్గుతేల్చేందుకు రెండు రాష్ర్టాల సీఈలు, బోర్డు నుంచి ఒక మెంబర్‌తో కమిటీ వేయాలని పట్టుబట్టారు. ఆ డిమాండ్‌కు బోర్డు చైర్మన్ సైతం అంగీకరించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదు.
అజగేశన్పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర జల్‌శక్తి శాఖ సైతం స్పందించలేదు. దీంతో ఇదే అదునుగా ఆయన మరింత రెచ్చిపోతున్నారు. తనపై ఫిర్యాదు చేసిన బోర్డు ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు దిగి, చిన్నచిన్న విషయాలపై మెమోలు జారీచేయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా బోర్డులో డిప్యుటేషన్ పూర్తయిన సిబ్బందిని ఏకపక్షంగా పంపించేస్తున్నారు. అలా తెలంగాణకు సంబంధించి ముగ్గురితోపాటు ఏపీకి చెందిన వారిని కూడా రిలీవ్ చేసినట్టు తెలిసింది. అజగేశన్ కక్ష సాధింపులకు తాళలేక పలువురు బోర్డు ఉద్యోగులే స్వచ్ఛందంగా డిప్యుటేషన్‌ను రద్దు చేసుకుంటున్నారు. దీన్నిబట్టే బోర్డులో పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
జీఆర్ఎంబీలో పరిస్థితి నానాటికీ దిగజారుతున్నా, మెంబర్ సెక్రటరీ ఆగడాలు శృతిమించినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై తెలంగాణ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బోర్డులో విధులు నిర్వర్తించలేమని స్పష్టం చేస్తున్నారు.
కానీ, వారి గోడును రాష్ట్ర ప్రభుత్వం కానీ, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇరిగేషన్శాఖతోపాటు కేఆర్ఎంబీ, జీఆర్‌ఎంబీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల జలసౌధలో సమీక్ష జరిపారు. కానీ, బోర్డు మెంబర్ సెక్రటరీ తీరును, ఉద్యోగుల సమస్యలను ఆ భేటీలో ప్రస్తావించలేదు. దీంతో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని బోర్డులోని ఉద్యోగులు, ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు. అజగేశన్పై చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. లేదంటే విధులు నిర్వర్తించలేమని తెగేసి చెప్తున్నారు.