హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వనుందో మంగళవారం వెల్లడించింది. సుమారు 120 పంటలతో పాటు గొర్రెలు, మేకలు, చేపలు, డెయిరీ, పందుల పెంపకానికి కూడా టెస్కాబ్ రుణాలను ఇవ్వనుంది. ప్రధాన పంటలైన వరికి ఎకరాకు రూ. 36-40 వేలు, పత్తికి రూ. 38-40 వేలు, కందికి రూ. 18-21వేలు ఇవ్వాలని ప్రతిపాదించింది. అదేవిధంగా రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న ఆయిల్‌పామ్‌కు ఎకరాకు రూ. 40-42వేల రుణ పరిమితిని ప్రతిపాదించింది. ఈ ఏడాది కొత్తగా డ్రాగన్‌ఫ్రూట్ పంటను రుణాల జాబితాలో చేర్చడం గమనార్హం. ఈ పంటకు ఎకరానికి రూ. 65-75 వేలు ఇవ్వాలని ప్రతిపాదించింది. గత ఏడాదితో పోల్చితే ప్రధాన పంటలకు కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు రుణాలను పెంచడం గమనార్హం. ఖరారు చేసిన రుణాల జాబితాను టెస్కాబ్ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు పంపించింది. దీని ప్రకారమే బ్యాంకులు రైతులకు పంటలవారీగా రుణాలను మంజూరు చేస్తాయి.
జీవాల పెంపకానికి రుణాలు
పంటలతో పాటు జీవాల పెంపకానికి కూడా రుణాల పరిమితిని టెస్కాబ్ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే గొర్రెల పెంపకానికి(20+1) రూ.18-20 వేలు, మేకల పెంపకానికి రూ.19-21వేలు ఖరారు చేసింది. పందుల పెంపకానికి 3+1కు రూ. 43వేలుగా నిర్ణయించింది. ఇక డెయిరీ నిర్వహణ కోసం ఒక్కో గేదెకు రూ. 23,400 నుంచి రూ. 25 వేల వరకు ఖరారు చేసింది. చేపల పెంపకానికి హెక్టారుకు రూ. 4 లక్షల రుణాన్ని నిర్ణయించింది.