Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కుదిరితే బట్ట కాల్చి మీద వెయ్యాలే.. లేకుంటే పరువు తీసి బజారుకు ఈడ్చాలే.. ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఆడుతున్న వికృత క్రీడ. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నది. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక, ఇతర పత్రికల లోగోలతో తప్పుడు వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది.
‘కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే ప్రళయమే’.. ఇలా రకరకాల తప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నది. ఈ వికృత క్రీడ వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం.. ఇదే సమయంలో బీఆర్ఎస్, కేసీఆర్‌పై ప్రజల్లో కొనసాగుతున్న అభిమానాన్ని తట్టుకోలేకనే అధికార పార్టీ ఈ వికృత క్రీడకు తెరలేపింది. అయితే ప్రభుత్వ అసమర్థ విధానాలు, పాలనా వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక పేరుతోనే నకిలీ వార్తలు వ్యాప్తిచేస్తే ఎక్కువ మందికి చేరుతుందని అధికార పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ పేరుతో తప్పుడు వార్తలను ప్రజల్లోకి చొప్పిస్తున్నది.
నకిలీ క్లిప్పింగ్‌లను సృష్టించిన వారిపై బీఆర్ఎస్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధం అవుతున్నది. ఈ క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నది.