మాటిచ్చి తప్పిన కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగులు కదంతొక్కారు. ‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే అయిన నవంబర్ 17లోగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేయకుంటే అదేరోజు నుంచి సామూహిక సెలవులు పెడుతాం’ అని అల్టిమేటం జారీచేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జూలై 11 నుంచి ఈ నెల 18 వరకు 41 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జనజాగరణ యాత్ర ము గింపు సందర్భంగా సీపీఎస్ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన ‘ఉద్యోగుల గర్జన సభ’కు అన్ని జి ల్లాల నుంచి ఉద్యోగులు పోటెత్తి ప్రభుత్వంపై సమరభేరి మోగించారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తేతెలంగాణ): ‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే అయిన వచ్చే నవంబర్ 17వ తేదీలోగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేయాల్సిందే.. లేదంటే అదేరోజు నుంచి ఉద్యోగులమంతా సామూహిక సెలవులు పెడుతాం’ అని సర్కార్‌కు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) అల్టిమేటం జారీచేసింది. అదేరోజు జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపడుతామని సీపీఎస్యూఈ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ వెల్లడించారు.

Employees Protest 01
సీపీఎస్‌ను రద్దుచేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సీపీఎస్ఈయూ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సీపీఎస్ ఉద్యోగుల గర్జన సభ నిర్వహించింది. ఈ సభకు అధ్యక్షత వహించిన స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ‘మా పాత పింఛన్ మాగ్గావాలె’ అని డిమాండ్ చేశారు. జూలై 11 నుంచి ఈ నెల 18 వరకు 41 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సీపీఎస్ జనజాగరణ యాత్ర ముగింపు సభను ఎల్బీస్టేడియంలో నిర్వహించారు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్, ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్, మ్యాన పవన్‌కుమార్, పోల శ్రీనివాస్, కిరణ్, లింగమూర్తి, నరేందర్‌రావు, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో సీపీఎస్ రద్దుకు రాని అడ్డు తెలంగాణలో ఎందుకొస్తుందని స్థితప్రజ్ఞ ప్రశ్నించారు. కేరళ, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గెలిపించింది సీపీఎస్ ఉద్యోగులేనన్నది గుర్తుంచుకోవాలని చెప్పారు. 22 ఏండ్లుగా సీపీఎస్ ఉద్యోగులు సామాజిక భద్రత కరువై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇప్పటి వరకు 5వేల మంది రిటైర్డ్ కాగా, ఏ ఒక్కరికీ రూ.5వేల పెన్షన్ అందడంలేదని పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దుచేస్తే రూ.17 వేల కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. అయినా సర్కార్ స్పందించకపోతే నవంబర్ 17న సామూహిక సెలవులు పెట్టి ధర్మదీక్ష చేపడుతామని హెచ్చరించారు.
పాత పింఛన్ పునరుద్ధరణ కోసం సీపీఎస్ ఉద్యోగులు వర్షంలోనూ గర్జించారు. భారీ వర్షం కురుస్తున్నా మహాగర్జనకు పోటెత్తిన సీపీఎస్ ఉద్యోగుల అడుగులు ఆగలేదు. వానలోనూ సీపీఎస్‌ను రద్దుచేయాలని, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని ముక్తకంఠంతో నినదించారు. వీ వాంట్ ఓపీఎస్.. పెట్టుబడుల పెన్షన్.. ఉద్యోగులకు టెన్షన్ అంటూ గొంతెత్తారు. మహిళా ఉద్యోగులు సైతం భారీగా తరలివచ్చారు. కొందరు మహిళా ఉద్యోగులు చంటిపిల్లలతో సభకు హాజరవడం విశేషం. కొందరు రెయిన్కోట్లు, గొడుగులు పట్టుకొని సభకు హాజరయ్యారు.