Tammineni Veerabhadram | ఖమ్మం కమాన్బజార్, డిసెంబర్ 8: రైతుబంధు కింద ఏడాదికి రూ.15 వేలు వస్తాయని రైతులు కాంగ్రెస్కు ఓటు వేస్తే ఉన్న రూ.10 వేలూ పోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత బస్సు మినహా మిగిలిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదని విమర్శించారు. ఖమ్మం నగరంలో ఆదివారం నిర్వహించిన సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ మహాసభలో ఆయన మాట్లాడారు. రైతుల పంటల సాగుకు పెట్టుబడిని అందించే రైతుభరోసా పథకాన్ని ఏడాదైనా అమలు చేయ డం లేదని మండిపడ్డారు.
వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 వంటి అనేక హామీలు అమలుకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. 3 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ.. హామీగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు. కొడంగల్లో ఫార్మాసిటీ పేరుతో మూడు వేల ఎకరాల గిరిజన భూములను బలవంతంగా లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.