హైదరాబాద్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరుగనున్న సీపీఎం 4వ మహాసభల పోస్టర్‌ను హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులుతో కలిసి ఆయన విడుదల చేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, హైడ్రా పేరుతో పేదల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం కూల్చుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్బంధం పెరిగిందని, కాంగ్రెస్ ఏడో వాగ్దానమైన స్వేచ్ఛ అమలు కావడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి, రెండు మినహా మిగతావి అమలు చేయలేకపోయారని విమర్శించారు. తాము ప్రభుత్వానికి మిత్రపక్షం కాదని స్పష్టంచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ..కేంద్రం తెచ్చిన లేబర్ కోర్టు రూల్స్ అమలు చేయమని సీఎంరేవంత్‌రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బడ్జెట్లో 25 శాతం పెంచాలని కోరారు.