హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. వర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, వాటి అభివృద్ధికి బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ల్యాబ్ పరికరాలు, హాస్టల్స్, మెస్, స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలు లేవని, భవనాల పెచ్చులు ఊడి విద్యార్థులు గాయపడుతున్నారని ఆరోపించారు. ఓయూ న్యాక్ గుర్తింపులో వెనుకబడి ఉందని, యూనివర్సిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి, వసతులు కల్పించాలని కోరారు. పీహెచ్డీ విద్యార్థులకు నెలకు రూ.25 వేలు ఫెలోషిప్ అందించాలని, అన్ని యూనివర్సిటీలకు రీసెర్చ్ గ్రాంట్స్ అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, సాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల వేతనాలు పెంచాలని, విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. 21-24 ఏండ్ల వయసు ఉండి, పది, 12తరగతులు, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర విద్యార్హతలు, 8లక్షలలోపు ఆదాయం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి ఉన్నవారు pminternship.mca.gov.in పోర్టల్ ద్వారా మార్చి 11వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.