హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. టీడబ్ల్యూజేఫ్, హెచ్‌యూజే సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మతోన్మాద రాజకీయాలు, బీజేపీ పట్ల తమ వైఖరేంటో స్పష్టం చేయాలని అన్నారు. సీపీఎం పార్టీ విస్తరించడానికి బలమైన ఉద్యమాలు, విస్తృత పోరాటాల ద్వారా ప్రజలకు చేరువవుతామని చెప్పారు. వామపక్ష పార్టీలను కలుపుకొని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు సీపీఎం చొరవ తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో వామపక్ష ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని, వామపక్ష పార్టీలు బలంగా ఉన్నచోట పరస్పరం సహకరించుకుంటామని చెప్పారు.
కేంద్రంలోని మోదీ సరారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ పేదల వ్యతిరేకమైనదని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీగా దేశంలోని ప్రతి ఒకరికి ఉచిత విద్య, వైద్యం అందాలని తాము కోరుకుంటుంటే మోదీ ఆ రెండు రంగాలను పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలకు కేటాయింపులే లేవని అన్నారు. వామపక్ష పార్టీల ఐక్యత తమకు తొలి ప్రాధాన్యం జాన్‌వెస్లీ చెప్పారు. ఉపాధి హామీ కార్మికులకు రోజు కూలీ రూ.400 కోసం కొట్లాడుతామని, రైతులకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలిచ్చే వరకూ వెనకి తగ్గబోమని అన్నారు. తమ హకుల కోసం పోరాటాల్లో కలిసి వస్తున్న ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించడంలో కొంత వైఫల్యం ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు.