హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): జీవో 252ను సవరించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా జర్నలిస్టులను వర్గీకరించాలని చూస్తున్నదని పేర్కొన్నారు. దీంతో సాధారణ, డెస్క్, మధ్యతరహా పత్రికలు అక్రెడిటేషన్లను కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు కనీస భద్రత, సంక్షేమం లేదని, ఆరోగ్య బీమా అమలు కావడం లేదని తెలిపారు.
హెల్త్ కార్డులపై కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో తీవ్ర జరుగుతున్నదని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్నద ని మండిపడ్డారు. వెంటనే జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.