ఆదిబట్ల, మార్చి 23: ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్షి వర్గ సభ్యులు భూపాల్ హెచ్చరించారు. సోమవారం ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్షి జాన్వెస్లీ జెండా ఊపి ప్రారంభించిన పాదయాత్ర రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం వరకు కొన సాగింది. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్షి వర్గ సభ్యుడు భూపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ ఎన్నికల హామీలు అమలుచేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, భూములు, రోడ్ల సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ పేదలు ఇంటి స్థలాలకు నోచుకోవడం లేదని వాపోయారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ .. ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలో రామోజీరావు ఆక్రమించిన భూమిని పేదలకు పంచాలని కోరారు. మండలంలోని కప్పాడ్, హఫీజ్పూర్, ఉప్పరిగూడ, తులేకలాన్, ఇబ్రహీంపట్నంలో సాగు చేసుకుంటున్న భూములను రైతుల పేరిట రిజిస్ర్టేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.