భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 17 : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలు పరిషరించాలని, అలైన్మెంట్ మార్చాలని భువనగిరి కలెక్టరేట్ ఎదుట వందలాదిమంది బాధిత రైతులతో కలిసి సామూహిక నిరాహార దీక్ష, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ అశాస్త్రీయంగా ఉన్నదని, వెంటనే అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లాలో 8 మండలాలు 43 గ్రామాల్లోని వందలాది ఎకరాల విలువైన భూమిని రైతులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వీరారెడ్డికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల నాయకుడు అవిశెట్టి పాండు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనూరాధ తదితరులు పాల్గొన్నారు.