హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం సచివాలయం లో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యింది. వివిధ ప్రజాసమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించింది. ఆరు గ్యారెంటీలను అమలుచేసే ప్రక్రియ ప్రారంభించడంపై హర్షం వ్యక్తంచేసింది.
రైతులకు హక్కుపత్రాలు, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు, వ్యవసాయ కార్మికులకు రోజుకూలీ రూ.600కు పెంపు, అర్హులైన పేదలకు 120 గజాల జాగాతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం ఆర్టీసీ కార్మికులపై గతంలో పెట్టిన కేసులను ఎత్తివేత, ఉపాధ్యాయుల పదోన్నతులు, ధరణి పోర్టల్‌లో సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. సీఎంను కలిసినవారిలో చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య ఉన్నారు.