Ponguleti Srinivasa Reddy | తిరుమలాయపాలెం, మే 12: ‘ప్రజా సమస్యలు పట్టవా? పదిసార్లు విన్నపించుకున్నా పట్టించుకోరా? ఎంతలా మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదెందుకు?’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సీపీఎం నాయకులు నిలదీశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను సహా పలువురు నాయకులు కలిసి మంత్రి వద్దకు వచ్చారు.
తిరుమలాయపాలెంలో నెలకొన్న సమస్యలను మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలో ప్రజలకు మరుగుదొడ్లు, బస్టాండ్ సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేయాలని కోరారు. ఇవే సమస్యలపై ఇప్పటికి పదిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎందుకు పట్టించుకోవడంలేదంటూ నిలదీశారు. ఇప్పటికైనా పరిష్కరించాలని కోరారు. నిరుపేదలకు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని, ఇందిరమ్మ కమిటీల బాధ్యులు పేదల పట్ల పక్షపాతవైఖరిని ప్రదర్శించారని ఆరోపిస్తూ మంత్రికి మరో ఫిర్యాదు చేశారు.