అమరచింత, డిసెంబర్ 6 : అమరచింత పట్టణ శివారులోని దుంపాయికుంటలో పేదలకు అందజేసిన ఇండ్ల స్థలాలకు హద్దులు కేటాయించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రానికి వచ్చిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని వారు అడ్డుకున్నారు. 30 ఏండ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లులేని పేదలకు 130 మందికి పట్టాలు ఇచ్చిందని, కానీ హద్దులు చూపలేదని నాయకులు గోపి, వెంకటేశ్, అజయ్, రమేశ్ తెలిపారు. దీంతో పట్టాదారులు చాలా రోజులుగా అక్కడ గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పేదలను గుర్తించి స్థలాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే శ్రీహరి గుడిసెలు వేసుకుని వారి వివరాలు సేకరించి పార్టీలకతీతంగా అర్హులను గుర్తించాలని తహసీల్దార్ రవికుమార్‌ను ఆదేశించారు.