హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని, అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేపట్టే సమావేశాలు, ఆందోళనల్లో పాల్గొనబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని తాము కోరుకోవడం లేదని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లోని ఎం బీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే స్థాయి కాంగ్రెస్‌కు లేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్తో సీట్ల గురించి ఇంకా చర్చ జరగలేదని వెల్లడించారు. తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని, తాము ఆశించిన స్థాయిలో సీట్ల కేటాయించకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, ఉద్యోగ, కార్మికుల సమస్యలపై వివరిస్తామని చెప్పారు. ఇతర పార్టీలవారిని ప్రలోభపెట్టి, బెదిరించి పార్టీలో చేర్చుకోవడం ద్వారా బ లపడాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాపై సీబీఐ దాడులు, తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ అందులో భాగమేనన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏ విజయరాఘవన్ విమర్శించారు. బీజేపీ రాష్ర్టాల్లో ప్రజాస్వామిక హకులను కాలరాస్తున్నారని, పోలీసు రా జ్యం నడుస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. స మావేశంలో సీపీఎం నేతలు బీవీ రాఘవులు, చెరుపల్లి సీతారాములు, రంగారెడ్డి పాల్గొన్నారు.