 
                                                            ఖమ్మం: ఖమ్మం జిల్లా (Khammam) చింతకాని మండలంలో దారుణం చోటుచేసుకున్నది. సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు (Samineni Ramarao) హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడులో మార్నింగ్ వాక్కు వెళ్లిన రామారావును దుండగులు గొంతుకోచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు. మరో మూడు రోజుల్లో మనవరాలు పెండ్లి ఉండగా రామారావు హత్యకు గురవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, పాతర్లపాడు గ్రామ సర్పంచ్‌గా రామారావు పనిచేశారు.
కాగా, సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కలుషిత హింసా రాజకీయాలకు తావు లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా పోలీసులను హెచ్చరించారు. క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
 
                            