యాదాద్రి : పోరాటాలకు పుట్టినిల్లయిన తెలంగాణ గడ్డపై ప్రజలను బెదిరించేలా ప్రధాని మోదీ ఉపన్యాసం చేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ఆరోపించారు. ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాన్ని, ప్రజలను బెదిరించటానికి మోదీ చేసిన ప్రసంగానికి తెలంగాణ ప్రజలు భయపడరని అన్నారు. మోదీ ప్రసంగాన్ని తెలంగాణ ప్రజలందరూ ఖండించాలని కోరారు.
మోదీ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి , విభజన సమస్యల పరిష్కారంపై ఎక్కడా మాట్లాడలేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లుగా తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలుకు యత్నించి బంగపాటు ఎదురైందని ఆరోపించారు. వారిని సమర్ధిస్తు బీజేపీ నాయకులు మాట్లాడడం విచారకరమని అన్నారు. కేంద్రం గవర్నర్లను తమ తాబేదారులుగా వాడుకుంటున్నారని, అసలు గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నలుగురు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందని బీజేపీ పై విరుచుకుపడ్డారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డమీద బీజేపీ ఆటలు సాగవని మునుగోడు ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.