హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, పోలింగ్ సజావుగా జరిగేందుకు వీలుగా గట్టి బందోబస్తు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు లేఖ రాశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి బీజేపీ అనేక గ్రామాల్లో దాడులకు పాల్పడుతుందని వివరించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఓటమి భయంతో తమకు అనుకూలంగా లేని ప్రజలను అసభ్య పదజాలంతో తిట్టడం, ఘర్షణలకు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సోమవారం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెంలో బీజేపీ నాయకులు తమ వాహనాలలో తెచ్చుకున్న రాళ్ళు, కర్రలతో విచక్షణ కోల్పోయి గ్రామస్థులు, పాత్రికేయులపై దాడులు చేశారన్నారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
అదే విధంగా మంగళవారం మునుగోడు మండలం పలివెల గ్రామంలో కూడా ఇదే తరహా దాడులకు తెగపడటంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తదితరులకు గాయాలయ్యాయని వివరించారు. ఇదే తరహా ఘర్షణలకు బీజేపీ నాయకులు పాల్పడితే మునుగోడులో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని, అమాయక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఓటమి భయంతో ఘర్షణ వాతావరణం సృష్టించడం ద్వారా ఎన్నికలను రద్దు చేయించేందుకు బీజేపీ అడుగులేస్తున్నదన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా మునుగోడు ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారిందన్నారు. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరుగుతున్నదని, ఓటుకు తులం బంగారం పంచుతున్నట్లు ప్రచారం కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ వద్ద 89.92 లక్షల రూపాయలు పట్టుబడ్డాయన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తరహా దాడులకు బీజేపీ నాయకులు మునుగోడులో తెగపడటం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఉప ఎన్నికల్లో దాడులకు పాల్పడిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిఘా విభాగాలు, కేంద్ర, రాష్ట్ర భద్రత బలగాలు, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మునుగోడు ఉప ఎన్నికల సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు.