కొత్తగూడెం అర్బన్, జూన్ 11: రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో ఆదివారం నిర్వహించిన సీపీఐ ప్రజాగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటులేదని అన్నారు.
2014కు ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రధాని మోదీ ఆ తర్వాత వాటిని పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీకి దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీనే అసలైన ఆర్థిక నేరస్థుడు అని వ్యాఖ్యానించారు. సీపీఐ జాతీయ నాయకుడు కే నారాయణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నారని, ఈ కారణంతోనే సీపీఐ ఆయనకు మద్దతు ఇస్తున్నదని అన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బీజేపీకి కట్టుబానిసలా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.