హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి, ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలో బీజేపీ, మోదీ, రాజగోపాల్‌రెడ్డి అన్నివిధాలా ఓడిపోయారని పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించి తెలంగాణలో ఆ పార్టీకి స్థానం ఉండదని స్పష్టం చేసిన నియోజకవర్గ ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. మునుగోడులో బీజేపీ ఘోరంగా ఓటమిపాలవడంతో హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్ ఎదుట సీపీఐ కార్యకర్తలు పటాకులు కాల్చారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కూనంనేనితోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ తదితరులు హాజరయ్యారు.