హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నదీ జలాలు, ఇతర అంశాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై సాగే ఉద్యమంలో టీఆర్ఎస్ పెద్దన్న పాత్ర పోషించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. ఆదిలాబాద్ సీసీఐని వేలం వేసే కుట్ర, కృష్ణా-గోదావరి ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై ఈ నెల 27 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్లో సీపీఐ జాతీయ మహాసభలు, సెప్టెంబర్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు.