హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అహంభావ వైఖరితోనే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందని, వైఖరిని మార్చుకోనిపక్షంలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఓటమి చవిచూడాల్సి వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ హెచ్చరించారు. మెజారిటీ రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నా బీజేపీ పాలకులు మాత్రం జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
శుక్రవారం ఏపీలోని గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంతో చర్చించాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగానే విశాఖ ఉకు ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్పై కోపంతో తిరుమల లడ్డూ వివాదంలో దేవుడిపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ బేషరతుగా సమంతకు క్షమాపణ చెప్పాలన్నారు.