హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను కేంద్రప్రభుత్వం వెంటనే జాతీయం చేయాలని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా.. కేంద్రం విధించిన నిబంధనలు అమలు చేయకుండా ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పౌర విమానయాన రంగంలో ఇండిగో వాటా 64శాతంగా ఉన్నదని గుర్తుచేశారు. పబ్లిక్ సెక్టార్లో విమానాలు లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ వంటి వాటిని దారిలో పెట్టడానికి ఇదే సరైన సమయమని, కేంద్రప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.