హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరమంతా ఇప్పుడు అందాలభామల చుట్టూ తిరుగుతున్నదని, ఆ భామల వెనకాల మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఎద్దేవా చేశారు. పాలనను, ప్రజా సమస్యలను పక్కనపెట్టి అందాలభామల కోసం రూ.కోట్లల్లో ఖర్చుపెట్టేది సొల్లు కార్చుకోవడానికా? అని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశానికి ఉగ్రవాదులా.. మావోయిస్టులా.. ఎవరు ప్రమాదకరమో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై చర్చలకు సిద్ధమైన కేంద్రం.. ఈ దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలపై స్పందించకపోవడం ఏమిటని నిలదీశారు.
మన దేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిఫాక్టో ప్రధానిగా వ్యవహరిస్తుంటే, ప్రధాని మోదీ డమ్మీ ప్రధానిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ట్రంప్ మన దేశ పాలసీలను నిర్దేశిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ప్రయత్నం చేస్తుంటే దానిని అడ్డుకోవాల్సిన ప్రధాని మోదీ మౌనం వహిస్తుండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ట్రంప్ ఆదేశాలను ప్రధాని మోదీ పాటించడం దేశానికే అవమానకరమని మండిపడ్డారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం మద్దతు తెలిపితే.. మోదీ మాత్రం ట్రంప్‌కు జై కొట్టి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని, ఇదేనా మీ దేశభక్తి? అని ప్రశ్నించారు.
దేశం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న సైనికులను అవమానపర్చేవిధంగా మాట్లాడిన కేంద్ర మంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. గత ఏడాదిన్నరగా పాత పథకాలను అరకొరగా అమలుచేస్తుండటంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నదంటూనే కొత్త పథకాలు పెడుతున్నారని, వీటి అమలుకు ఎకడినుంచి డబ్బులు తెస్తున్నారో స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఎంతమంది మావోయిస్టులను చంపివేశారు? మరెంత మందిని చంపుతారు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అసలు కేంద్ర ప్రభు త్వం లక్ష్యం ఏమిటో శ్వేతప్రతం విడుదల చే యాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌లో కేంద్ర బలగాలతో కలిసి రాష్ట్ర పోలీసులు సైతం పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాలని కోరారు.