CPI Narayana | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : హైడ్రా చర్యలతో బడాబాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందో? లేదో? గానీ వారి ఒత్తిడితో రేవంత్‌రెడ్డే జైలుకు వెళ్లే ప్రమాదం ఉన్నదని, రేవంత్‌రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడని, మధ్యలో ఆపేస్తే ఆ పులే తినేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని మగ్దుం భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్రమణల కూల్చివేత విషయంలో రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేయాలని సూచించారు.
నోటరీ ద్వారా కొందరు ప్రభుత్వ భూమి అమ్మకాలు చేపట్టారని, వీటి విషయంలో పేదలకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఎన్ కన్వెన్షన్‌ను ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మించారని, ఈ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి చెరువును నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను కూల్చే విషయంపై రేవంత్‌రెడ్డి అఖిల పక్ష సమావేశం పెట్టాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ నిర్మాణాలతో పోల్చడం సరికాదని చెప్పారు.