హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థను అదానీ లాంటి వారికివ్వాలని, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని మంత్రివర్గం నుంచి తప్పించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ అనుమానం వ్యక్తంచేశారు. అందుకే కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పౌర విమానయానరంగంలో ఇండిగో వాటా 64శాతంగా ఉన్నదని గుర్తుచేశారు. పబ్లిక్ సెక్టార్లో విమానాలు లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. తప్పు చేసిన ఇండిగో యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా, వారితో బుజ్జగింపు చర్యలు ఏమిటని ప్రశ్నించారు. ఇండిగో సంక్షోభంపై సమగ్ర దర్యాప్తు జరిపి, సంస్థను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు.