కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 10: బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజలకు అర్థమయ్యేలా ఎలా వివరించాలో కేసీఆర్‌కు బాగా తెలుసని పేర్కొన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది జాతీయపార్టీగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బీజేపీ సర్కార్‌పై బీఆర్ఎస్తో కలిసి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. కేంద్రంపై అవకాశం వచ్చినప్పుడల్లా వారి నిర్ణయాలను, విధానాలను ఎండగడుతూనే ఉన్నామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడం వల్ల దేశం తిరోగమనంలోకి వెళ్లిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ బలం తగ్గిందని, ప్రతిపక్షాలు ఏకమైతే బీజేపీని నిలువరించడం కష్టమేమీకాదని చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ ఎ న్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడం, హిమాచల్‌ప్రదేశ్‌లో కాం గ్రెస్ గెలుపొందడం అంటే ప్రజలు బీజేపీపై ఎంత వ్యతిరేకంగా ఉన్నా రో అర్థం చేసుకోవాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏలను అడ్డుపెట్టుకొని మోదీ ఇష్టం వచ్చినట్టుగా ఇతర పార్టీల వారిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్‌కు పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయని, మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను పెండింగ్‌లో పెట్టి కాలయాపన చేయడం తగదన్నారు. తెలంగాణలో సీపీఐ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయని, బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ఖాతా కూడా తెరవదని జోస్యం చెప్పారు.