హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య నాటకాలు ఆడుతున్నారని, ఇవి ఆయనకు ఏమాత్రం తగవని సీపీఐ నేత కే నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీగా ఉండి కేంద్రం దగ్గర బీసీ రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నారని నిలదీశారు. ఈ విషయంపై ప్రధానమంత్రి మోదీని అడగకుండా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తానని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వదని తేల్చిచెప్పారు. ఈ విషయం రాసిపెట్టుకోవాలని సవాల్ విసిరారు. వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ తీసుకొస్తే, అప్పుడు బీజేపీ వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాంటి బీజేపీ, బీసీలకు న్యాయం చేస్తుందని అనుకోవడం భ్రమేనని నారాయణ వ్యాఖ్యానించారు.