హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, విస్తృత కార్యవర్గ సమావేశాలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా కనిపిస్తుందో చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆయనను రాజీనామా చేయించి పోటీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నిక మోదీ ప్రోద్బలంతో వచ్చిందనేని, ఇక్కడ మోదీని ఓడించకపోతే దేశం మొత్తం ఇదే విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సహజంగా కాంగ్రెస్‌లో యాంటీ బీజేపీ ట్రెండ్ ఉంటుందని, కానీ తెలంగాణలో వాళ్ల కొంపే సరిగా లేదని విమర్శించారు.
చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పార్టీగా, తెలంగాణలో అనేక ఉద్యమాలు, త్యాగాలు చేసిన పార్టీగా, మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించటమే లక్ష్యంగా సీపీఐ తీర్మానం చేసిందని తెలిపారు. దేశంలో లౌకిక, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో ఒక వేదిక ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నదని, తెలంగాణలోనూ అదే చేస్తున్నామని స్పష్టం చేశారు. మునుగోడులో సీపీఐ ఐదుసార్లు గెలిచిందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నామని వివరించారు.దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు ప్రగతిశీల శక్తులను కలుపుకొని ఓ కార్యాచరణతో ముందుకుపోతామని ఇప్పటికే టీఆర్ఎస్ ప్రకటించిందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీపీఐ కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. మునుగోడు సభకు రావాలని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించారని తెలిపారు.
భవిష్యత్తులోనూ కలిసి పోరాడుతాం
ఒక్క మునుగోడు ఉపఎన్నికకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, వామపక్ష శక్తులు కలిసి ఓ కార్యాచరణతో ముందుకు పోతామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. ్రప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చినప్పుడు, రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్నప్పుడు దాన్ని నిలబెట్టాల్సిన నైతిక బాధ్యత వామపక్ష పార్టీలపై ఉన్నదని వెల్లడించారు. బీజేపీ జాతీయ నాయకత్వం అంతా మునుగోడుకే వస్తున్న నేపథ్యంలో.. ప్రగతిశీల శక్తుల ముందు నిలబడలేమనేది ఆ మతోన్మాద పార్టీకి అర్థమయ్యేలా సంకేతాలు ఇచ్చి తీరుతామని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, పశ్యపద్మ, హేమంతరావు, బాల మల్లేశ్ పాల్గొన్నారు.
ప్రగతిశీల శక్తుల పునరేకీకరణ
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రగతిశీల, క్రియాశీల శక్తులన్నీ మళ్లీ ఒక్కటవుతున్నాయా? అంటే మునుగోడు వేదిక అవునని స్పష్టంచేసింది. ఆరేడు నెలలుగా మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, రైతు నాయకులు, మేధావులతో చర్చలు జరుపుతున్నారు. ప్రగతిశీల శక్తులు ఒక్కతాటిపైకి రావాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎం అగ్రనేతలు గతంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో తాము టీఆర్ఎస్తో కలిసి బీజేపీని ఎదుర్కొంటామని ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం మునుగోడు ప్రజాదీవెన బహిరంగ సభ సాక్షిగా సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి స్వయంగా హాజరై టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడాన్ని మేలి ములపుగా భావిస్తున్నారు.