హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నదని, వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ నేతలు పశ్య పద్మ, ఈటీ నరసింహ, కళవేణ శంకర్‌తో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికులు, ఆర్టిజన్లు, సింగరేణి కార్మికులు, అసంఘటిత కార్మికుల పట్ల ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిరంకుశ ఆలోచనలు చేయడం సరికాదని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆర్టిజన్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిషరించాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ శాశ్వత అధికారం కోసం దేశభక్తి ముసుగులో దేశ విచ్ఛిన్నానికి, విభజన రాజకీయాలకు కుట్ర చేస్తున్నదని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ల పరంగా బీసీలకు, రాజకీయ ప్రాధాన్యపరంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశమై రాజ్యాంగ నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసి అన్ని అంశాలను పరిశీలించాలని సూచించారు.