దేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో అతిపెద్ద ముప్పు ఉంది. సమాఖ్య స్ఫూర్తిని అవి దెబ్బతీస్తున్నాయి. సెక్యులర శక్తులన్నీ కలిసి పోరాడితే తప్ప దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోలేం
– డీ రాజా
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): భారతదేశం ప్రమాదకర స్థితిలో ఉన్నదని, బీజేపీ, ఆరెస్సెస్ కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని పిలుపునిచ్చారు. దేశం ఉనికి ప్రమాదంలో పడినప్పుడు లౌకిక పార్టీలన్నీ ఏకమవ్వాలని, దేశానికి విముక్తి కల్పించాలన్నారు. ప్రధాని సబ్కా సాథ్.. సబ్కా వికాస్ అంటారనీ కానీ అంబానీ, అదానీ, టాటా, బిర్లాలతో ప్రధాని మోదీ ఉంటారని ఆరోపించారు. బీజేపీ పేదలు, రైతుల పక్షాన నిలబడ లేదని, బడాబాబులకే మోదీ రెడ్‌కార్పెట్ పరుస్తున్నదని విమర్శించారు. దేసెక్యులర్ శక్తులన్నీ కలిసి పోరాడితే తప్ప.. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోలేమని హెచ్చరించారు.
బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో డీ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఖమ్మంలో అంత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో సుపరిపాలన అందుతున్నదని అందుకు సీఎం కేసీఆర్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని.. ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
రాజ్యాంగేతర శక్తులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగేతర శక్తులుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశానికి ప్రమాదకరంగా మారాయని రాజా విమర్శించారు. దేశ మౌలిక వ్యవస్థలను మార్చాలని అవిఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు.
భారత్, హిందూ దేశంగా మారితే ప్రమాదమని ఆనాడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారని రాజా తెలిపారు. బీజేపీదంతా వన్‌నేషన్.. వన్ లీడర్.. వన్ పార్టీ అనే విధానమని విమర్శించారు. రాజ్యాంగేతర శక్తిగా మారుతున్న మోదీ సర్కారు.. రాష్ర్టాల సమస్యలను పట్టించుకోకుండా బడాబాబులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం కలిసి పోరాడితే తప్ప దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు.