రామగిరి, జూన్ 6: రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో విఫలమైందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. మరో వైపు దేశంలో ఐదు రాష్ర్టాల ఎన్నికల అనంతరం కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని ధ్వజమెత్తారు. నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే యూరియా యాప్, రైతు డిస్కమ్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకుడు ఉజ్జిని యాదగిరిరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, సీనియర్ నాయకుడు మల్లేపల్లి ఆదిరెడ్డి, పార్టీ నేతలు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, బంటు వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి, టీ వెంకటేశ్వర్లు, కర్రసైదిరెడ్డి పాల్గొన్నారు.
గొప్ప కమ్యూనిస్టు యోధుడు ‘చండ్ర’ ; సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : దేశంలోని అణగారినవర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వర్ రావు అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ పేర్కొన్నారు. రాజేశ్వర్ రావు 112వ జయంతి సందర్భంగా శనివారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూమ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటంలో రాజేశ్వర్‌రావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కందిమల్ల ప్రతాపరెడ్డి, కలవేణి శంకర్, బాల నరసింహ, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ శ్రీ రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.