హైదరాబాద్ జూలై 15 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయవంచన, నమ్మక ద్రోహం, మోసం, కుట్రలకు మారుపేరని నిప్పులు చెరిగారు. మంగళవారం బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇదిరాపార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో సిరికొండ మాట్లాడారు. బీసీలు భారతదేశంలో రెండో శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారంటే ఇందుకు హస్తం పార్టీయే కారణమని మండిపడ్డారు. 60 ఏండ్లు అధికారం వెలగబెట్టిన ఆ పార్టీ కులగణన చేయకుండా, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయకుండా దగా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ఆ పార్టీ దేశవ్యాప్తంగా పుట్టగతుల్లేకుండా పోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కులగణన చేస్తామని, బడ్జెట్లో ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏనాడూ బీసీ కోటాకు చట్టబద్ధత కల్పించే విషయంలో చిత్తశుద్ధి చూపలేదని ఆక్షేపించారు. ఇప్పుడు బీసీ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగిన తర్వాత హడావుడి చేస్తూ తప్పటడుగులు వేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలిసినా కేసీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ తరఫున మద్దతిస్తూ వచ్చామని, అసెంబ్లీలో చర్చ సందర్భంగా విలువైన సూచనలు చేశామని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీసీ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, రాష్ట్రపతికి పంపించి చేతులు దులుపుకొన్నదని విమర్శించారు. అనేకసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లి ఏనాడూ బీసీ బిల్లుల గురించి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలవలేదని ఆక్షేపించారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లడంలోనూ విఫలమయ్యారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం కోటాకు చట్టబద్ధత కల్పించకుంటే కాంగ్రెస్ సర్కారు వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. బీసీలు తిరగబడి మరణశాసనం లిఖించడం ఖాయమని తేల్చిచెప్పారు.
భూకంపం సృష్టిస్తం: మాజీ మంత్రి తలసాని
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కామారెడ్డిలో ఇప్పించిన డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయాలని చూస్తే భూకంపం సృష్టిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తప్పుల తడకగా కులగణన చేశారని, నగరంలో 20 లక్షల మంది ఇండ్లకు వెళ్లకుండానే తప్పుడు గణంకాలతో బీసీల జనాభాను తగ్గించి చూపారని విరుచుకుపడ్డారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఇప్పుడు దగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బీసీ బిల్లులను ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలు యాచకులు కాదని, నమ్మించి వంచిస్తే తమ సత్తా ఏంటో చూపుతామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర : గంగుల కమలాకర్
నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌ది మోసాల చరిత్రేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల ఓట్ల కోసం అర్రులు చాచి ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నదని మండిపడ్డారు. జనాభా దామాషా ప్రకారం బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కేటాయించాలని, పార్లమెంట్లో బీసీ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. నమ్మించి నట్టేట ముంచాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.
బీసీలకు మంత్రిత్వ శాఖ ఏది: జోగు రామన్న
కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నా బలహీన వర్గాలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజ మెత్తారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరిగిందని వాపోయారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారని గుర్తుచేశారు. బీసీలతో పాటు మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని చెప్పారు. కానీ, మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం కోటా పేరిట దగా చేయాలని చూస్తున్నదని, చట్టబద్ధత కల్పించకుండా ఆర్డినెన్స్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవ్వకుంటే గుంజుకుంటం: శ్రీనివాస్ గౌడ్
బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బలహీనవర్గాలంటే ఆ పార్టీకి మొదటి నుంచీ చిన్నచూపేనని, అందుకే 42 శాతం కోటా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నదని దుయ్యబట్టారు. బీసీలంటే అడుక్కునే వారు కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఆచరణలోకి తేవాలని, బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుంటే పోరాడి గుంజుకుంటామని హెచ్చరించారు.
సంఘటితంగా ఉద్యమం: స్వామిగౌడ్
మోసం చేయడం మొదటి నుంచీ కాంగ్రెస్‌కు అలవాటేనని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా ధోకా ఇవ్వాలని చూస్తున్నదని విమర్శించారు. కోటా ఇవ్వకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకొనే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. బీసీలంతా ఏకమై ఉద్యమించి సాధించుకుంటామని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బలహీనవర్గాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
అన్యాయం చేస్తే తరిమికొడతం: ముఠా గోపాల్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయాలని చూస్తే ఊరుకొనే ప్రసక్తేలేదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హెచ్చరించారు. నాడు రేవంత్‌రెడ్డి బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు పచ్చి అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అమలు చేయకుండా డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలి : బడుగుల
నాడు కేసీఆర్ సూచన మేరకు పార్లమెంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి కొట్లాడామని, కులగణన చేయాలని సభ లోపల, బయటా పోరాటం చేశామని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గుర్తుచేశారు. బీసీ ప్రధాన మంత్రి అయినా కేంద్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలనే కాదు రైతులను, కార్మికులను, ఉద్యోగులను, సబ్బండ వర్గాలను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
రేవంత్‌కు బుద్ధి చెప్తం: తుల ఉమ
బలహీనవర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూస్తున్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ మహిళా నేత, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి బీసీల ఓట్లపై ఉన్న ప్రేమ సంక్షేమ పథకాల అమలుపై లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో బీసీలను సముచితంగా గౌరవిస్తే కాంగ్రెస్ అడుగడుగునా అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
కోటా ఇచ్చే దమ్ములేకుంటే దిగిపో: వకుళాభరణం
బీసీలంతా ఏకమై కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడాలని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. అగ్రవర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటే బలహీనవర్గాలకు ఏం జరుగుతదో సీఎం రేవంత్‌రెడ్డి తన పాలనలో చూపుతున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం కోటాపై తప్పటడుగులు వేస్తూ బీసీలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీల హక్కులను కాలరాసి ధోకా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కులగణన చేశామని గొప్పలు చెప్పుకొంటున్న రాహుల్‌గాంధీ, బీసీ రిజర్వేషన్ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు మోదీని ఎందుకు ఒప్పించడం లేదని, పార్లమెంట్లో ఎందుకు కొట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం కోటా ఇచ్చే దమ్ములేకుంటే రేవంత్‌రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
చట్టబద్ధత కల్పించకుండా దగా: వద్దిరాజు
కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు తప్పుడు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు నిండా ముంచుతున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా బలహీనవర్గాలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి బీసీ బిల్లులు పంపిందే తప్ప ఆమోదానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమై ఇప్పుడు ఆర్డినెన్స్‌ల పేరిట డ్రామాలు ఆడుతున్నదని దుయ్యబట్టారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే లోకల్‌బాడీ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఓటుతో బుద్ధి చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
వెల్లువెత్తిన బీసీ చైతన్యం
బీసీల చైతన్యం వెల్లువెత్తింది. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బీసీ మేధావులు, బీసీ ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ‘జై బీసీ..జైజై బీసీ.. సాధిద్దాం.. సాధిద్దాం బీసీ కోటా సాధిద్దాం..’ అంటూ ముక్తకంఠంతో చేసిన నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోటాపై కాంగ్రెస్ సర్కారు నాన్చివేత ధోరణి, తప్పుడు విధానాలను బీసీపీఎఫ్ ఎండగట్టింది..ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని తేల్చిచెప్పింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయకుంటే ఓటుతోనే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించింది. ధర్నాకు మేధావులు, న్యాయనిపుణులు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.
ఇతర కులసంఘాల నాయకులు సైతం సంఘీభావం ప్రకటించారు. రిజర్వేషన్లపై రేవంత్ సర్కారు నిర్లక్ష్య ధోరణిని ఎత్తిచూపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మహాధర్నాలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, వీ శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, కోరుకంటి చందర్, జైపాల్ యాదవ్, అంజయ్యయాదవ్, భగత్, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్‌భాస్కర్, బీసీ సంఘాల నేతలు రాజారాం యాదవ్, ఓరుగంటి వెంకటేశం గౌడ్, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మఠం భిక్షపతి, అంజనేయులుగౌడ్, పల్లె రవికుమార్‌గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, చిరుమల్ల రాకేశ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, నేతలు మల్కపురం శివకుమార్, సుమిత్రా ఆనంద్ తానోబా, కిశోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
యుద్ధానికి నాంది పలుకుదాం: జస్టిస్ ఈశ్వరయ్య
ముఖ్యమంత్రి అంటే ఒక్క రెడ్లకే కాదనీ, బీసీలకు, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హైకోర్టు రిటైర్డ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య హితవుపలికారు. ఆయన కాగడా పట్టుకొని ఏదో సాధిస్తానని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కాగడాను బీసీల చేతికి అందించారని చెప్పారు. బీసీలు తమ హక్కులను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అదే కాగడాతో ఇప్పుడు బీసీలు యుద్ధానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయని తెలిసినా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిందని విమర్శించారు. దాని సాధ్యాసాధ్యాలను తెలుసుకోకుండా లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా మ్యానిఫెస్టోలో పెట్టారని చెప్పారు.
23
తర్వాత బీసీ సంఘాల నేతలు నిలదీస్తే కులగణన చేస్తామని చెప్పి ఏదో నామమాత్రంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి కులగనణకు ఉపక్రమించారని విమర్శించారు. తనతో పాటు బీసీ మేధావులమంతా కలిసి ఓ సమగ్ర ఫార్మాట్‌ను రూపొందించి, తమిళనాడులో చేసిన చట్టాన్ని ప్రభుత్వానికి అందిస్తే కాగితాలకే పరిమితం చేశారని వాపోయారు. ఎక్కడికీ తిరగకుండా.. ఇండ్లళ్లకు వెళ్లకుండానే తూతూమంత్రంగా కులగణన చేశారని ధ్వజమెత్తారు. కులగణనను ఎవరూ సరిగా చేయలేదని, నాటకీయంగా చేసి దాదాపు 20 నెలలుగా కాలయాపన చేశారని చెప్పారు. తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో పెడితేగానీ బీసీ రిజర్వేషన్ల కోటాకు చట్టబద్ధత రాదని స్పష్టంచేశారు. తమిళనాడులో చేసిన విధంగా సమగ్రంగా చట్టాన్ని రూపొందించి ప్రభుత్వానికి అందజేశామని గుర్తుచేశారు. తాము రూపొందించిన చట్టాన్ని, సూచనలను పక్కనబెట్టి కోటాను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. బీసీలు సంఘటితమై రిజర్వేషన్ల సాధనకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పాలకులపై ఒత్తిడి పెంచాలి ప్రొఫెసర్ చిరంజీవులు
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పెద్దసంఖ్యలో ధర్నాకు తరలివచ్చిన వారి చైతన్యం చూస్తుంటే తెలంగాణలో త్వరలోనే బీసీల రాజ్యం వచ్చే సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తున్నదని ప్రొఫెసర్ చిరంజీవులు చెప్పారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 61 శాతం ఉన్నదని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం కోటా సరిపోదని, కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకైనా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ఆర్డినెన్స్‌ల పేరిట మభ్యపెట్టవద్దని హితవు పలికారు. కాంగ్రెస్ వచ్చాక కులగణనతో బీసీల జనాభాను 56.36 శాతానికి తగ్గించిందని, అయినా 42 శాతం కోటా ఇస్తామంటున్నదని కాబట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిల్లులు పెట్టి రాష్ట్రపతికి పంపించి వదిలేశారని, పార్లమెంట్లో ఆమోదం కోసం కేంద్రంపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు తీర్పుమేరకు ఆర్డినెన్స్ చట్టం ముందు నిలబడదని, దానిని కోర్టు మళ్లీ కొట్టేసే ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఏదేమైనా బిల్లును పాస్ చేయించేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కొట్లాడాలని సూచించారు. మూడు నులల నుంచి డజన్‌కు పైగా కేంద్రంలో క్యాబినెట్ మీటింగ్‌లు అయ్యాయని, కానీ ఒక్కసారి కూడా కేంద్రం రిజర్వేషన్ల ప్రస్తావన తేలేదని గుర్తుచేశారు. అడగకుండానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీసీ కోటాకు చట్టబద్ధత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రశ్నించారు. బీసీలంతా సంఘటితమై రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీపై ఒత్తిడి పెంచాలని కోరారు. 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట సమావేశాలను స్తంభింపజేసి అయినా బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని చెప్పారు.