హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ‘పోలీసుల మీద, అధికారయంత్రాంగం మీద చాలా విమర్శలు చేస్తున్నారు.. ఎమర్జెన్సీ పాలన అని కొందరు మాట్లాడుతున్నారు. ఎమర్జెన్సీ ఉంటే మీతో ఇలా మాట్లాడుతామా? ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు అందరూ లోపల (జైళ్లో) ఉండేవాళ్లు’ అని సిట్ అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ జర్నలిస్టులనుద్దేశించి వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్ట ప్రకారం తాము ఏదైనా చేస్తామని, తమ దర్యాప్తుకు కావలసిన వాళ్లను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద బుధవారం సాయంత్రం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల అరెస్ట్‌పై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘మేము విచారణకు పిలిపిస్తే రావాలి కదా? ఒక రిపోర్టర్ బ్యాంకాక్ వెళ్తున్నానని చెప్పారు. మాకు కోఆపరేట్ చేయకుండా ఎందుకు వెళ్తున్నారు? విచారణకు వస్తానని చెప్పి వెళ్లిపోవడం కరెక్టేనా?’ అని ప్రశ్నించారు.
‘చట్టం ముందుకు వచ్చి వివరణ ఇవ్వకుండా ఎందుకు పారిపోతున్నారు? మీరు కరెక్ట్‌గా ఉంటే ఎందుకు భయపడుతున్నారని’ అని వ్యాఖ్యానించారు. యాంకర్ దేవి వస్తానని చెప్పి సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసుకుని వెళ్లిపోయిందని ఆరోపించారు. ‘మీరు కరెక్ట్‌గా ఉంటే విచారణకు సహకరించండి. ఏ ఆధారమున్నదని ఒక అధికారిపై వార్తలు వేస్తారు’ అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా వాళ్ల ఇండ్లకు ఎలా వెళ్తారని విలేకరులు ప్రశ్నించగా.. ‘సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. అసలు నోటీసు ఎందుకివ్వాలి? మా విచారణ కోసం కావలసిన వాళ్లను తీసుకొస్తాం’ అని అన్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి జర్నలిస్ట్ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ అరెస్ట్ చేస్తారా? అని మరో జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ‘బరాబర్ చేస్తం. ఇన్వెస్టిగేషన్‌కు సహకరించాలి. మేము వచ్చినప్పుడు మా వెంటరావాలి.
రాను అంటే మేము చేయాల్సిన రీతిలో చేస్తామని’ అని సజ్జనార్ చెప్పారు. ఒక మహిళా అధికారిపై ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేసిన వ్యవహారంలో కేసులు నమోదు చేసి చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రముఖ టీవీ చానల్ రిపోర్టర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, వారు పారిపోయే ప్రయత్నం చేస్తే పట్టుకొచ్చామని వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, మహిళలపై విమర్శలు చేస్తే వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతాయో ఆలోచించాలని అన్నారు. ‘మీ ఇండ్లల్లో తల్లులు, అక్కలు, చెల్లెళ్లు ఉంటారు.. వారిపైకూడా ఇలాగే చేస్తే వారు బాధపడరా?’ అని ప్రశ్నించారు. ఒక రిపోర్టర్‌ను అరెస్టు చేసే సమయంలో తమతో విచారణకు రావాలని చెప్తే తలుపులు తీయలేదని, తాము తలుపులు ఎక్కడ పగులగొట్టామో చూపించాలని సవాల్ చేశారు. ‘ఆ సీఈవో ఎక్కడ? ఆయనను విచారణకు రావాలని చెప్తే ఎందుకు దొరకడం లేదు? ఎక్కడున్నా పట్టుకొస్తాం’ అని మండిపడ్డారు. ఎవరైనా విచారణకు సహకరించాల్సిందేనని సజ్జనార్ స్పష్టంచేశారు.
వ్యక్తిత్వ హననం చేస్తే కఠిన చర్యలు : డీజీపీ
సోషల్ మీడియా వేదికగా ఎవరూ వ్యక్తిత్వ హననం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని అవమానపర్చితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఇతరులు, వారి కుటుంబ సభ్యుల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు, తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేయడం, వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. చట్టానికి లోబడి, నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే ఆ పరిమితులు దాటి, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తే మాత్రం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.