సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): దొంగలు అక్కడికి చేరుకునేలోపే దేశ సరిహద్దుల్లో నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు సికింద్రాబాద్‌లో భారీ చోరీచేసి పారిపోతున్న నేపాలీ గ్యాంగ్‌ను బార్షోల చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. అరెస్టయిన నిందితుల వద్దనుంచి రూ. 5 కోట్ల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, పోయిన సొత్తును రికవరీ చేసిన ఘనత దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ పోలీసులు సొంతం చేసుకున్నారు. నార్త్‌జోన్ లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు 10 రోజుల్లోనే ఈ కేసు మిస్టరీని ఛేదించాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
బుధవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సికింద్రాబాద్, పీజీ రోడ్డులోని ఓమ్ టవర్స్‌లో నివాసముండే రాహుల్ గోయెల్ ఈనెల 9న ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా బయటకు వెళ్లాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా.. ఇంట్లో ఉన్న రూ.49 లక్షల నగదు, వెండి, బంగారు, వజ్రాభరణాలు కనిపించలేదు. అతడి వద్ద వాచ్‌మన్‌గా పనిచేసే కమల్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు బృందాలు.. బుధవారం 13 మంది సభ్యులున్న ఈ ముఠాలోని 10 మందిని అరెస్టు చేశారు.
నమ్మకంతో పనిచేసి..
నేపాల్‌కు చెందిన శంకర్మాన్ సింగ్ సౌద్ అలియాస్ కమల్ ఆరేండ్లుగా రాహుల్ గోయల్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. నమ్మకంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ చుట్టుపక్కల కూడా చాలా మంది నేపాలీలు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. ఇంటి యజమాని రాహుల్ ఈనెల 9వ తేదీన కుటుంబ సమేతంగా బయటకు వెళ్తున్నట్టు రెండు రోజుల ముందే తెలుసుకున్న కమల్ దొంగతనానికి ప్లాన్ వేశాడు. పుణే, బెంగళూర్‌లో ఉన్న తమ బంధువులను పిలిపించాడు. ఇంటి తాళాలు పగులగొట్టడంలో నైపుణ్యం ఉన్న నేపాల్‌కు చెందిన భరత్ బిస్త్‌ను కూడా పిలిపించాడు. 9వ తేదీన ఇంటి యజమాని వెళ్లిపోయిన తరువాత.. గ్యాంగ్ సభ్యులందరూ సెక్యూరిటీ రూమ్‌లో కలుసుకొని దావత్ చేసుకున్నారు. ఆ తరువాత భరత్ ఇంటి తాళాలు పగులగొట్టాడు. ఇంట్లోకి వెళ్లి టార్చ్‌లైట్ సహాయంతో ప్రతిగదిని వెతుకుతూ బీరువాలు, లాకర్లు పగులగొట్టి నగలు, ఆభరణాలు అపహరించారు. అక్కడే దొంగిలించిన సొమ్మును మూడు భాగాలుగా చేశారు. ప్రధాన వాటా కమల్ తీసుకొని కూకట్పల్లి మీదుగా పుణే, ముంబైకి ప్రైవేటు బస్సులో వెళ్లాడు. మరో గ్యాంగ్ మరో మార్గంలో పుణేకు చేరుకోగా, ఇంకో గ్యాంగ్ బెంగళూర్‌కు వెళ్లింది.
హైదరాబాద్‌లోనే మరో బృందం..
మరో గ్యాంగ్ ఝాన్సీ, లక్నో మీదుగా సరిహద్దు దాటేందుకు యత్నించింది. ఈ ముఠాలోని మోహన్ సౌద్ అనే నిందితుడు బస్సు ఎక్కుతూ కిందపడి ఝాన్సీలో గాయపడ్డాడు. దీంతో ఈ ముఠా తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. యూపీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టారు. నిందితులందరూ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మోహన్సౌద్తో పాటు ప్రకాశ్‌నగర్‌లోని లాల్‌సింగ్ తప్ప ఇంట్లో ఉన్న విశాల్సౌద్, వికాస్ సౌద్, బ్రిజేశ్, భార్ష నాథ్‌ను అరెస్ట్ చేశారు. ట్యాక్సీ డ్రైవర్ వినోద్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు.
Press Note Of Cp Hyd On Ram
పరారీలో మరో ముగ్గురు..
ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులున్నారు. వీరిలో ఇప్పటి వరకు పదిమందిని అరెస్టు చేశారు. మూడో గ్యాంగ్ సభ్యులు భరత్ బిస్త్, భారతి సౌద్, పూజ సౌద్ను అరెస్టు చేయాల్సి ఉంది. పట్టుబడిన నేరస్థుల నుంచి రూ. 41,60,410 నగదు, 2.8 కిలోల బంగారం, రూ.9.56 కిలోల వెండి, వాచ్‌లు, విదేశీ కరెన్సీ, ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన నార్త్‌జోన్ శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులను సీపీ అభినందించి, వారికి రివార్డులు అందజేశారు.
బార్షోల చెక్‌పోస్టు వద్ద..
నగర పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. భారత్ నుంచి నేపాల్‌కు పాస్‌పోర్ట్టు లేకుండానే రాకపోకలు సాగించవచ్చు. దీంతో ప్రధానంగా ఇరు దేశాలు రాకపోకలు సాగించే మూడు చెక్‌పోస్టుల వద్ద ఉండే ఎస్ఎస్బీ (సాహస్త్ర సీమాబల్) ఫోర్స్ అధికారులతో హైదరాబాద్ సీపీ, నార్త్‌జోన్ డీసీపీ మాట్లాడారు. అక్కడున్న ఉన్నతాధికారుల సహాయం తీసుకొని ఎస్ఎస్బీతో కలిసి నిఘాను పెంచారు. అప్పటికే హైదరాబాద్‌లో నిందితులకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలను సేకరించారు. వాటిని దేశ సరిహద్దుల్లో నిఘా పెట్టిన బృందాలకు పంపించారు. ఈనెల 14న కమల్, పార్వతి, సునీల్ చౌదరి ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అద్దెకు తీసుకున్న ఇన్నోవాలో వచ్చి బార్షోల వద్ద సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్ఎస్బీ పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. దీంతో ఈ ముగ్గురిని, ఇన్నోవా వాహనం, డ్రైవర్లను అదుపులోకి తీసుకొని.. అక్కడే ఉన్న హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. అక్కడి కోర్టులో వారిని హాజరుపరిచి, ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.
మంచిపేరు పాడుచేసుకోవద్దు..
నేపాలీ అసోసియేషన్‌తో సీపీ సీవీ ఆనంద్
ఎన్నో ఏండ్లుగా నేపాలీలు భారత్‌లోని కాలనీలు, నివాసాలకు సెక్యూరిటీగా పనిచేస్తూ ఎంతో నమ్మకంగా ఉంటున్నారు. భారత్, నేపాలీ దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకరినొకరం గౌరవించుకుంటాం. అలాంటిది ఇప్పుడు కొంతమంది నేపాలీలు ముఠాలుగా ఏర్పడి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లు ఉన్న మంచిపేరును పాడుచేసుకుంటున్నారు. మంచిపేరు పాడుచేసుకోవద్దు. ఇలా చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని పనిలో పెట్టుకోరు. అప్పుడు వీరే బాధపడుతారు. దొంగతనాల జోలికి వెళ్లవద్దు.. అంటూ నేపాలీ అసోసియేషన్ ప్రతినిధులకు ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ సూచించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు పలువురు నేపాలీలు, అసోసియేషన్ ప్రతినిధులు వచ్చారు. ముంబై, పుణే, బెంగళూర్‌లో ఉండే ముఠా నాయకులు చెప్పినట్లు చేసి, జైలు పాలు కావద్దని వారికి సీపీ సూచించారు. నేరాలు చేయబోమని పలువురు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.