Vemulawada | వేములవాడ, మే 30 : దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో శివుని వాహనం నందిని దేవుడిలా కొలుస్తూ మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ వేములవాడ రాజన్న ఆలయంలో ఉంది. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో శివుని వాహనమైన కోడె మృత్యుఘోషతో విలవిలలాడుతోంది. రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడేలు తిప్పాపూర్లోని గోశాలకు తరలిస్తుండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండడం, పర్యవేక్షణ లోపం వాటికి శాపంగా మారింది. శుక్రవారం గోశాలలో 8 కోడెలు మృతిచెందగా పుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది ఖననం చేశారు. నిత్యం పదుల సంఖ్యలో స్వామివారి గోశాలలోని కోడెలు మృత్యువాత పడుతుండగా ఆలయ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
దక్షణ కాశిగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోడె మొక్కు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ఏటా స్వామివారికి ఈ కోడె మొక్కుపై రూ. 22 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అయితే భక్తులు సమర్పించిన నిజ కోడెలను రైతులకు అందజేసే విధానం ఉండగా పలు అవకతవకలకు పాల్పడంతో గత ఆరుమాసాలుగా పంపిణీని ఆలయ అధికారులు నిలిపివేశారు. ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం పరిశీలించి వ్యక్తిగతంగా వాటిని సంరక్షిస్తానని అఫిడవిట్ తీసుకొని అప్పగించే విధానం ఉండగా పెద్ద మొత్తంలో ఒకరికి అప్పగించగా వివాదానికి దారితీసింది. అయితే ప్రస్తుతం స్వామివారికి భక్తుల సమర్పిస్తున్న నిజ కోడేలను తిప్పాపూర్ గోశాలలో నిలువ ఉంచుతున్నారు. దాని పరిధిలో సుమారు 600 వరకే ఉండే వసతి సౌకర్యాలు ఉండగా ప్రస్తుతం రాజన్న గోశాలలో 1250 పైగా కోడెలు రావడంతో సరియైన వసతి సౌకర్యం లేక మృత్యువాత పడుతున్నట్లుగా భక్తులు ఆరోపిస్తున్నారు. వందల కోట్ల ఆదాయం ఉన్న కోడెల సంరక్షణలో రాజన్న ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.