హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలోని 23 రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడులో రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో కేసులు పెరుగడం లేదని, అయినా ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని. గుంపులుగా తిరగొద్దని పిలుపునిచ్చారు. మంత్రి శనివారం టీఎస్ఎంఎస్ఐడీసీ కార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్ పూర్తిగా అదుపులోనే ఉన్నదని అన్నారు.
పాజిటివిటీ రేటు 0.5 శాతానికి మించడం లేదన్నారు. ఇతర ప్రాంతాల్లో కొవిడ్ విజృంభణ దృష్ట్యా రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. వైద్యసిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించవద్దని, పీహెచ్‌సీల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకు వైద్య వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి కచ్చితంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. ప్రజలు కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత వ్యాక్సిన్, కొవిడ్ టెస్టులు, మందుల పంపిణీ వంటి సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కొవిడ్ నియంత్రణలో ఇప్పటివరకు వైద్య సిబ్బంది చాలా బాగా పనిచేశారని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ వేగంగా జరుగుతున్నని చెప్పారు. 60 ఏండ్లు దాటినవారికి బూస్టర్ డోస్ 16.8 శాతం మందికి వేశామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వాక్సిన్ వేసుకోని వాళ్లను ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి ఇంటింటికీ వెళ్లి వాక్సిన్ వేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు.