శనివారం 04 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:49

డిగ్రీ పరీక్షలు రద్దు?

డిగ్రీ పరీక్షలు రద్దు?

  • ఫైనల్‌ ఇయర్‌వారికి నేరుగా పట్టాలు
  • ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో డిగ్రీ క్లాసులు
  • మంత్రి సబిత ఆధ్వర్యంలో ప్రతిపాదనలు
  • తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్‌దే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరం డిగ్రీ పరీక్షలను పూర్తిగా రద్దుచేసే అవకాశం ఉన్నది. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు పరీక్షల రద్దుకే మొగ్గుచూపినట్టు తెలిసింది. ఫస్ట్‌, సెకండియర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తే బాగుంటుందని సూచించారు.

ఇప్పటివరకు డిగ్రీలో ఐదు సెమిస్టర్లు పూర్తయ్యాయని, ఇంటర్నల్‌ మార్కులు కూడా ఉన్నాయని, వాటి సగటు లెక్కించి ఫైనల్‌ఇయర్‌ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానంచేయాలని ప్రతిపాదించారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌ 1 నుంచి డిగ్రీ ఫస్టియర్‌, ఆగస్టు 15 నుంచి సెకండియర్‌, ఫైనలియర్‌ తరగతులను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపాకే అమలుచేయనున్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, కళాశాలల విద్య కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo