Minister Konda Surekha | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం క్రిమినల్ కేసులో రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు దాఖలు చేసింది. డిసెంబర్ 12న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. తనపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ను పరిగణనలోనికి తీసుకున్న ధర్మాసనం సెక్షన్ 356 బీఎన్ఎస్ ప్రకారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పరువు నష్టం క్రిమినల్ కేసు నమోదుచేసింది. ఇప్పటికే ఫిర్యాదుదారుడు నాగార్జనతోపాటు సాక్షిగా యార్లగడ్డ సుప్రియ వాంగ్మూలం నమోదు చేసిన కోర్టు.. ప్రత్యర్థికి అవకాశం కల్పించి వివరణ కోరింది. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు సురేఖపై కేసు నమోదు చేస్తూ సీసీ నంబర్ 490/2024ను కేటాయించింది. సురేఖ తరఫున సీనియర్ న్యాయవాది మస్తాన్నాయుడు చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. కొండా సురేఖను డిసెంబర్ 12న కోర్టు విచారించనున్నది.
కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ప్రత్యర్థి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనల కోసం వాయిదా వేయనున్నది. వచ్చే నెల 4న విచారణకు స్వీకరించి సురేఖ వివరణ పట్ల ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వు చేయనున్నది. ఆమెపై రెండో కేసు కూడా నమోదయ్యే అవకాశాలు మెండగ ఉన్నట్టు న్యాయనిపుణులు చెప్తున్నారు. సురేఖపై ఒకే అంశంపై రెండు కేసులు నమోదు కానున్నాయి.